సంస్థ ఆర్థికస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలి :
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కూనంనేని
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జూన్ రెండో వారంలోగా సింగరేణి సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. యూనియన్ రాష్ట్రఅధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్‌లతో కలిసి బుధవారం హైదరాబాద్‌లోని మఖ్ధూం భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థ ఆర్థిక స్థితిపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ. 22 వేల కోట్ల బకాయిలు ఉంటే రెండున్నర ఏండ్లలోనే ఆ మొత్తం రూ.56వేల కోట్లకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలో క్రమంగా రెగ్యూలర్ కార్మికులను తగిస్తూ కాంట్రాక్ట్ కార్మికులకు తక్కువ జీతాలు చెల్లిస్తూ వెట్టి చాకిరి చేయించుకోవడం సరికాదన్నారు. కోల్ ఇండియా తరహాలో వేతనాలు చెల్లించాలని సూచించారు. సంస్థలో పని చేసే కార్మికులను నిత్యం ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయనీ, ఈ నేపథ్యంలో మెడికల్ ఇన్‌వ్యాలివేషన్ నియామకాల భర్తీని పునరుద్ధరించాలని కోరారు. అలాగేపెట్రో ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌పై కేసులు పెట్టి మానసిక వేదింపులకు గురిచేయడం సరికాదన్నారు. వెంటనే ఆయనపై ఏపీ సర్కార్ కేసులు ఉపసంహరించుకోవాలని సూచించారు. విద్య, వైద్యరంగంలో ఫీజుల దోపిడిని అరికట్టాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మొదటి తారీకున వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆశా, అంగన్‌వాడీ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో యూనియన్ సెంట్రల్ కమిటీ సభ్యులు స్వామి పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


