కాలుష్యరహిత నీరు,
మెరుగైన రహదారులపై దృష్టి పెట్టాలి :
మంత్రి శ్రీధర్ బాబు
స్థానిక పేదలకే ఇండ్లు : ఎమ్మెల్యే మాధవరం
కూకట్‌పల్లిలో డబుల్ బెడ్‌రూమ్స్ పంపిణీ
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
హైదరాబాద్ అభివృద్ధికి మౌలిక సదుపాయాలే కీలకమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని ఖైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం 62 మంది లబ్దిదారులకు కేటాయించింది. బుధవారం మంత్రి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఒక లబ్దిదారుడి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే కలుషిత రహిత తాగునీరు, మెరుగైన రహదారులు, నిరంతర విద్యుత్ సరఫరా, సమర్థవంతమైన డ్రయినేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే చర్యలతో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించే అవకాశం కలుగుతుందన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి వివరించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. స్థానిక ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇండ్లను కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన నిరుపేదలకే కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా లంబాడీలు, ఖైతలాపూర్ వాసులు, వికలాంగులు, విలేకరులు వంటి వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లాటరీ విధానంలో ఇతర ప్రాంతాల వారికి ఇండ్ల కేటాయింపులు చేయొద్దన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్‌రూమ్ పథకాల అమలులో అధికారులు గందరగోళానికి గురవుతున్నారని, దీనిపై స్పష్టత అవసరమని అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ కాలనీలలో డ్రయినేజీ, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మెన్ బండి రమేష్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో నిరుపేద కుటుంబాలు నివసిస్తున్నాయని, అదనపు నిధులు కేటాయించి మరిన్ని ఇండ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కలెక్టర్ మను చౌదరి, జోనల్ కమిషనర్, ఎమ్మార్వో, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



