ఆర్థిక సాధికారత కోసమే స్త్రీనిధి రుణాలు: అనంత కిషోర్ 

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలన్న లక్ష్యంతోనే స్త్రీనిధి ద్వారా రుణాలు అందజేస్తున్నామని స్త్రీనిధి స్టేట్ జోనల్ మేనేజర్ అనంత కిషోర్ అన్నారు. సోమవారం మండలంలోని హాసకొత్తూరు లో మహిళా సంఘ సభ్యురాలికి స్త్రీనిధి ఐశ్వర్య పధకం క్రింద రు.4.50 లక్షల రుణంతో మంజూరు చేసిన టెంట్ హౌస్ ను స్టేట్ జోనల్ మేనేజర్ అనంత కిషోర్,  కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల స్త్రీనిధి రీజనల్ మేనేజర్ గట్టు రామదాసు తో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీనిధి కింద మహిళా సంఘ సభ్యులు చేపట్టే ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు రూపాయలు 50 వేల నుంచి 5 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందజేస్తున్నామని ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. మంజూరు చేసే రుణాలకు బ్యాంకు వడ్డీ కన్నా తక్కువ వడ్డీ ఉంటుందని బ్యాంకు వారు వేసే చార్జీల తో పోలిస్తే స్త్రీనిధి చాలా తక్కువ ఛార్జీలు ఉంటాయని,  మహిళలు, చిరు వ్యాపారులు స్త్రీనిధి రుణాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం కుంట గంగాధర్, సిసి నవీన్, మహిళలు,  సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love