– లౌకిక భారతాన్ని నిర్మించాలి
– కేవీపీఎస్, డీవైఎఫ్‌ఐ నేతలు
– హైదరాబాద్‌లో సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సుభాష్ చంద్రబోస్ (నేతాజీ) స్ఫూర్తితో మతతత్వ రాజకీయాలపై పోరాటాలను ఉధృతం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ పిలుపు నిచ్చారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతూ దేశభక్తియుత భావాలతో లౌకిక భారతదేశ నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పారు. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పౌరులంతా పోరాడాల్సిన అవసరముందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతతత్వ మనస్తత్వం పోయినప్పుడే మతతత్వం పోతుందని చెప్పారు. మతతత్వాన్ని మట్టుపెట్టే పని భారతీయులందరిదని అన్నారు. దీనికోసం అందరూ మతతత్వ దృక్పథంతో కాకుండా నిజమైన జాతీయవాద మనస్తత్వాన్ని అలవరచుకోవాలని కోరారు. దేశంలో మత రాజకీయాలను బీజేపీ నిస్సిగ్గుగా అమలు చేస్తున్నదని విమర్శించారు. మతాన్ని, రామున్ని రాజకీయంలోకి లాగుతూ పబ్బం గడుపుకుంటున్నదని చెప్పారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో బీజేపీ మార్కు రాజకీయం స్పష్టంగా కనిపించిందని ఎద్దేవా చేశారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ గొప్ప పాత్ర పోషించారని అన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. గొప్ప విద్యావంతుడుగా, దేశభక్తి భావాలు కలిగిన నాయకునిగా, ధైర్యం త్యాగనిరతి, సాహసం ఎంతో ఉత్తేజమిస్తాయని చెప్పారు. ‘మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని తెచ్చి పెడతాను’అంటూ నేతాజీ ఇచ్చిన నినాదం దేశ ప్రజలు, యువతకు ఆదర్శంగా నిలిచాయని వివరించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్‌ఏ)ని స్థాపించడంతోపాటు, ఆజాద్ హింద్ పౌజు అనే బలమైన సంస్థ ద్వారా స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపారని చెప్పారు. స్వాతంత్ర పోరాటంలో గాంధీజీతో సైద్ధాంతికంగా విభేదించి సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నాడని అన్నారు. మతతత్వం, మతోన్మాదం విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించారని వివరించారు. అనేకమార్లు జైలు జీవితం, నిర్బంధాలకు గురయ్యారని అన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై రాజీలేని పోరాటం చేశారన్నారు. జాతీయోద్యమంలో ఏమాత్రం పాల్గొనని వారు, బ్రిటీష్ సామ్రాజ్యవాదంతో రాజీపడ్డవారు హిందూత్వవాదులు నేడు సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. హిందూత్వ సిద్ధాంతం, ఆరెస్సెస్ విధానాలపైన నేతాజీ తీవ్రమైన విమర్శలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ జావిద్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత, హైదరాబాద్ నగర కార్యదర్శి అధ్యక్షులు లెనిన్ గువేరా, కె అశోక్ రెడ్డి, నాయకులు స్టాలిన్, రమేశ్, కేవీపీఎస్ నాయకులు బాలపీరు, శ్రీలత, డీవైఎఫ్‌ఐ నాయకులు హస్మి, క్రాంతి, రఘు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.