రాజకీయ పార్టీని ప్రకటించనున్న విద్యార్థి బృందం

A student group to announce a political partyఢాకా : బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేతలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి బృందం నూతన రాజకీయ పార్టీని ప్రకటించనుంది. మరో రెండురోజుల్లో రాజకీయపార్టీ పేరు ప్రకటించనున్నట్టు సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా స్టూడెంట్స్‌ ఎగైనెస్ట్‌ డిస్క్రిమినేషన్‌ (ఎస్‌ఏడీ) అధ్యక్షుడు నహిద్‌ ఇస్లాం నేతృత్వంలో ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా తిరుగుబాటుగా మారింది. ఆందోళనలతో దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో వెయ్యిమందికి పైగా మరణించారు. దీంతో షేక్‌ హసీనా గతేడాది ఆగస్టులో భారత్‌కు పారిపోయారు. అనంతరం నోబెల్‌ బహుమతి గ్రహీత ముహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుతీరిన సంగతి తెలిసిందే. నహిద్‌ ఇస్లాం ఈ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉన్నారు. కొత్తగా ఏర్పడనున్న రాజకీయ పార్టీకి కన్వీనర్‌గా నహిద్‌ ఇస్లాం బాధ్యతలు చేపట్టనున్నట్లు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని వర్గాలు తెలిపాయి. నూతన పార్టీకి నాయకత్వం వహించడంపై దృష్టిసారించేందుకు నహిద్‌ ఇస్లాం తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు పదవికి సైతం రాజీనామా చేయనున్నారని పేర్కొన్నాయి. యువకుల నేతృత్వంలోని పార్టీ దేశ రాజకీయాల్లో గణనీయమార్పులు తీసుకురాగలదని పలువురు రాజకీయ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఇటీవల ముహమ్మద్‌ యూనస్‌ ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆసక్తి లేదని ప్రకటించారు.

Spread the love