ఒక దేశ అభివృద్ధి ఆ దేశ విద్యావ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించే సాధనం మాత్రమే కాదు,శాస్త్రీయ దృక్పథం, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దే శక్తి. అందుకే ప్రతి దేశం విద్యను అత్యంత ప్రాధాన్య రంగంగా పరిగణిస్తుంది. కానీ నేడు మన దేశంలో విద్యారంగంలో జరుగుతున్న పరిణామాలు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ ఆందోళనకు ప్రధాన కారణం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో వరుసగా వెలుగు చూస్తున్న లోపాలే. నీట్ వంటి పరీక్షల్లో పేపర్ లీకేజీ ఆరోపణలు విద్యా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. సుమారు 22 లక్షల మంది విద్యార్థులు ఏండ్ల తరబడి కష్టపడి చదివి, కుటుంబాలు లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ ఇప్పిస్తున్నాయి. కానీ ఒక పేపర్ లీకేజీతో వారి శ్రమ, వారి కలలు, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఈ పరిస్థితుల ప్రభావం కేవలం పరీక్షల వరకే పరిమితం కావడం లేదు. విద్యార్థుల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిరాశ పెరుగుతున్నాయి. పేపర్ లీకేజీల నేపథ్యంలో పదకొండు మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు దేశానికి అత్యంత విషాదకరం. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? దీనికి పరీక్షల నిర్వహణ సంస్థలు, ప్రభుత్వాలు జవాబు చెప్పాలి. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బాధ్యులపై చర్యలు తీసు కోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, విద్యార్థుల్లో నమ్మకం కలిగించే స్థాయిలో ప్రభుత్వం స్పందించలేదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. మరోవైపు, డిజిటల్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక సాంకేతికత గురించి గొప్పలు చెప్పే ప్రభుత్వం, జాతీయ స్థాయి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించలేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టిఎ)పై వరుసగా వస్తున్న ఆరోపణలు పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి.
గతంలో కూడా నీట్, నెట్ వంటి పరీక్షల లీకేజీలు జరిగిన పరీక్షల నిర్వాహన వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది
ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం, సాంకేతిక భద్రత ను నిర్ధారించాలి. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తిరిగి నమ్మకం కల్పించాల్సిన బాధ్యత పాలకులపైనే ఉంది. అదే సమయంలో విద్యారంగానికి సంబంధించిన విధానాలపైనా తీవ్రమైన చర్చ అవసరం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను క్రమంగా కేంద్రీకరిస్తూ, విద్యను తన నియంత్రణలోకి తీసుకువస్తోందనే విమర్శలు ఉన్నాయి. నూతన జాతీయ విద్యా విధానం శాస్త్రీయ దృక్పథాన్ని, హేతుబద్ధ ఆలోచనను పెంపొందించకుండా, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల తయారీకి మాత్రమే పరిమితమవుతోందనే ఆందోళన విద్యావేత్తల్లో వ్యక్త మవుతోంది.
విద్య అనేది కేవలం కంపెనీలకు ఉద్యోగులను తయారు చేసే ప్రక్రియ కాదు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చైతన్యవంతమైన పౌరులను తయారు చేసే వ్యవస్థ.
భారత విద్యా చరిత్ర కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయులు విద్యను సమానత్వానికి, సామాజిక న్యాయానికి, విముక్తికి సాధనంగా భావించారు. వారి దృష్టిలో విద్య అంటే కేవలం డిగ్రీ కాదు,శాస్త్రీయ ఆలోచన, హేతుబద్ధ దృక్పథం, ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంపొందించే ప్రక్రియ.అందువల్ల జాతీయ పరీక్షల వ్యవస్థలో సమూల సంస్కరణలు చేపట్టాలి. పేపర్ లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రతి విద్యార్థికి నాణ్యమైన, పారదర్శకమైన, నమ్మకమైన విద్యను అందించాలి. ఒక దేశాన్ని నిర్మించేది అద్దాల భవ నాలు, రంగుల గోడలు కాదు, భావితరాలు. ఆ భావితరాలను తీర్చిదిద్దేది విద్య. అలాంటి విద్యనే నిర్లక్ష్యం, అవినీతి, పేపర్ లీకేజీలతో బలహీనపరిస్తే నష్టపోయేది ఒక్క విద్యార్థి కాదు, దేశ భవిష్యత్తే.
డా.ఆర్ ఎల్ మూర్తి, 8247672658



