భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ – మల్హర్ రావు
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.మంగళవారం మండలంలోని కెజిబివి పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, వంటగది, స్టోర్ రూమ్,విద్యార్థినుల వసతి గదులు, మరుగుదొడ్లు,పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, ఆరోగ్యం, భద్రత, క్రీడలు తదితర సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.10వ తరగతిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థినులతో ఆత్మీయంగా ముచ్చటించారు. “హలో స్టూడెంట్స్.. ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు.? భోజనం ఎలా ఉంటోంది? రోజూ ఏమేమి ఆటలు ఆడుతున్నారు.? అంటూ విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినులు తమ చదువు, పాఠశాలలో అందుతున్న భోజనం, క్రీడలు, ఇతర కార్యక్రమాల గురించి కలెక్టర్‌కు వివరించారు.అనంతరం భవిష్యత్తులో మీరు ఏమి కావాలనుకుంటున్నారు?” అని కలెక్టర్ అడగగా, కొందరు విద్యార్థినులు ఐఏఎస్, ఐపీఎస్, వైద్యులు,న్యాయవాదులు, ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావాలని తమ ఆకాంక్షించలను వెల్లడించారు. విద్యార్థినుల సమాధానాలపై కలెక్టర్ స్పందిస్తూ గుడ్.. బాగా చదవండి.. మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు పట్టుదలతో చదవాలని అభినందించారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు.
పదో తరగతి విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసి, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యం, సబ్జెక్టుల వారీగా ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధ చూపుతూ, వారి సందేహాలను నివృత్తి చేసి, చదువుపై ఆసక్తిని పెంపొందించే విధంగా బోధన సాగించాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
వంటగది, స్టోర్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థినులకు భోజనానికి ఉపయోగించే బియ్యం,కూరగాయలు, పప్పులు,ఇతర నిత్యావసర సరుకుల నిల్వలను తనిఖీ చేశారు. సరుకుల నాణ్యత, నిల్వ విధానం, వంటగది పరిశుభ్రత, భోజనం తయారీ విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినులకు ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆహార పదార్థాలను సక్రమంగా నిల్వ చేయడంతో పాటు, వంటగది మరియు భోజన ప్రదేశాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. చదువుతో పాటు విద్యార్థినులలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందించేందుకు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.
విద్యార్థినులు ప్రతిరోజూ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు.యూనిఫారాలు పంపిణీని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. మరుగుదొడ్లు నిర్మాణాలను పరిశీలించిన ఆయన నెల రోజుల్లో పూర్తి చేసేలా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ బావుందని వంట సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో కాటారం ఆర్డిఓ రవీందర్,డీఈఓ రాజేందర్,శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి,తహసీల్దార్ రవి కుమార్,ప్రిన్స్ పల్ భవాని,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



