Tuesday, August 18, 2026
E-PAPER
Homeఖమ్మంకళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తక్షణమే కొనసాగించాలి

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తక్షణమే కొనసాగించాలి

- Advertisement -

– మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య
– కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిలిపివేతపై బీఆర్ఎస్ నిరసన
నవతెలంగాణ-సత్తుపల్లి 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కోర్టు ‘స్టే’ విధించిన నేపద్యంలో, దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం సరైన కౌంటర్ ను కోర్టుకు వినిపించడంలో  విఫలమైందని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం సత్తుపల్లిలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం పోస్ట్ ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ​వివాహాలు జరిగిన ఆడపడుచులకు రావాల్సిన ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పేద కుటుంబాల కష్టాలను కేసీఆర్ స్వయంగా గుర్తించారని సండ్ర అన్నారు. 

​ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆసరాగా నిలిచేందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తొలుత రూ.50 వేలతో ప్రారంభించి, ఆ తర్వాత ఆర్థిక సాయాన్ని రూ.1,00,116కు పెంచారని వివరించారు. ఈ పథకాల ద్వారా తెలంగాణలోని వేలాది నిరుపేద కుటుంబాలకు ఆర్థిక ధైర్యం లభించిందన్నారు. ప్రస్తుతం ఆర్థిక సహాయం అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షేమ పథకాలపై ప్రభుత్వం సకాలంలో స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ప్రజాదరణ పొందిన పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా ఆ హామీపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.

​రైతులకు కొండంత భరోసాగా నిలిచిన రైతు బీమా పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి  నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. రైతు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం సకాలంలో చెల్లించి రైతు కుటుంబాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

​పేదలు, రైతులు, మహిళల సంక్షేమాన్ని పక్కనబెడితే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నిధులను అర్హులైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా వెంటనే అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని వీడకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వెంకట వీరయ్య హెచ్చరించారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. ​ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపేది లేదని సండ్ర స్పష్టం చేశారు. పేదల హక్కుల సాధన కోసం క్షేత్రస్థాయిలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని తేల్చిచెప్పారు.

​ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలిచిపోయిన నిధులను విడుదల చేయాలని పునరుద్ఘాటించారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, నాయకులు దొడ్డా శంకరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, షేక్ రఫీ, మల్లూరి అంకంరాజు, వీరపనేని బాబీ, బొడ్డు శివబాబు, బెల్లంకొండ రాము, ఎర్రా రమేష్, మోరంపూడి శ్రీధర్, పాలా వెంకటరెడ్డి, మారోజు సురేష్, పగుట్ల వెంకటేశ్వరరావు, పుల్లారెడ్డి, సోమిరెడ్డి, మోదుగు పుల్లారావు, అమరవరపు కృష్ణారావు, పర్వతనేని వేణు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -