జపాన్ ఓపెన్ టైటిల్ వశం
ఫైనల్లో యమగూచిపై ఘన విజయం
టోక్యో (జపాన్) : భారత అగ్రశ్రేణి షట్లర్, తెలుగు తేజం పి.వి సింధు చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడుసార్లు ప్రపంచ చాంపియన్ అకానె యమగూచి (జపాన్)పై 21-17, 21-17తో పి.వి సింధు వరుస గేముల్లో గెలుపొందింది. 50 నిమిషాల టైటిల్ పోరు థ్రిల్లర్‌లో అన్‌సీడెడ్ సింధు అద్భుత విజయం సాధించింది. 2024 సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ (సూపర్ 300) తర్వాత సింధుకు ఇదే తొలి టైటిల్ కాగా.. 2022 సింగపూర్ ఓపెన్ (సూపర్ 500) తెలుగు తేజానికి ఇదే తొలి మేజర్ టైటిల్. 31 ఏండ్ల వయసులో జపాన్ ఓపెన్ విజేతగా నిలిచిన సింధు.. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డు నెలకొల్పింది. మిక్సడ్ డబుల్స్‌లో టాప్ సీడ్ చైనా జోడీ ఫెంగ్, పింగ్‌లు విజేతలుగా నిలువగా.. పురుషుల సింగిల్స్‌లో క్రిస్టో పాపొవ్ (ఫ్రాన్స్) టైటిల్ సాధించాడు. మహిళల డబుల్స్‌లో కిమ్, కాంగ్ (దక్షిణ కొరియా), పురుషుల డబుల్స్‌లో ఫజర్, ఫిక్రి (ఇండోనేషియా) చాంపియన్లుగా అవతరించారు.
నువ్వా..నేనా
మహిళల సింగిల్స్ ఫైనల్ హోరాహోరీగా సాగింది. లోకల్ స్టార్ యమగూచి ఈ ఏడాది సింధుపై ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలుపొందింది. సింధు వరుసగా క్వార్టర్స్, సెమీఫైనల్లో ప్రత్యర్థుల వాకోవర్ ఇవ్వటంతో చెమటపట్టకుండా ఫైనల్‌కు చేరుకుంది. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సింధు.. టైటిల్ పోరులో సత్తా చాటింది. తొలి గేమ్‌లో 3-0తో మందంజ వేసింది. యమగూచి పుంజుకుని 5-5తో స్కోరు సమం చేసినా సింధు 9-6తో మెరిసింది. విరామ సమయానికి 9-11తో సింధు వెనుకంజ వేసింది. కానీ విరామం తర్వాత సింధు రెచ్చిపోయింది. వరుస పాయింట్లు సాధించింది. 12-12తో స్కోరు సమం చేయటంతో పాటు 16-12, 17-15తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 38 షాట్ల సుదీర్ఘ ర్యాలీలో పైచేయి సాధించిన యమగూచి 17-17తో సమవుజ్జీగా నిలిచింది. కానీ, ఇక్కడ కచ్చితమైన స్మాష్‌లు, క్రాస్ కోర్టు డ్రాప్స్‌తో సింధు వరుసగా నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తొలి గేమ్‌ను 21-17తో సొంతం చేసుకుంది. కీలక రెండో గేమ్‌లోనూ సింధు జోరు తగ్గలేదు. యమగూచిపై ఎదురుదాడి చేస్తూ పాయింట్లు సాధించింది. 8-3, 14-7తో ముందంజలోకి దూసుకెళ్లింది. యమగూచి 17-19తో రేసులోకి వచ్చే ప్రయత్నం చేసినా.. సింధు 21-17తో రెండో గేమ్‌తో పాటు జపాన్ ఓపెన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.



