– ఎఫ్‌ఏటీఎఫ్ సిఫార్సులను దుర్వినియోగం చేస్తున్నారు
– మోడీ ప్రభుత్వంపై ఆమ్నెస్టీ ఆగ్రహం
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పౌర సమాజ బృందాలను, కార్యకర్తలను అణచివేస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విమర్శించింది. ఇందుకోసం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) చేసిన సిఫార్సులను దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎఫ్‌ఏటీఎఫ్ సిఫార్సులను ఆధారంగా చేసుకొని క్రూరమైన చట్టాలను అమలు చేసేందుకు అధికారులు పూనుకుంటున్నారని, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలను అడ్డుకుంటూ వాటిపై ఉగ్రవాద సంబంధమైన ఆరోపణలు మోపుతున్నారని తెలిపింది.
న్యూఢిల్లీ: ‘ఉగ్రవాదంపై పోరాటం సాగించే పేరుతో మోడీ ప్రభుత్వం ఎఫ్‌ఏటీఎఫ్ సిఫార్సులను వాడుకుంటోంది. ఆర్థిక, ఉగ్రవాద నిరోధక చట్టాలను దుర్వినియోగం చేస్తూ విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేస్తోంది. తన సిఫార్సుల దుర్వినియోగంపై ప్రభుత్వాధికారులను ఎఫ్‌ఏటీఎఫ్ బాధ్యులను చేయాలి’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బోర్డు అధ్యక్షుడు ఆకార్ పటేల్ పత్రికా ప్రకటనలో కోరారు. చట్టాలను దుర్వినియోగం చేయడం ద్వారా ఎఫ్‌ఏటీఎఫ్ ప్రమాణాలకు, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టానికి అనుగుణంగా వ్యవహరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎఫ్‌ఏటీఎఫ్ 37 సభ్య దేశాలతో ఏర్పడిన అంతర్ ప్రభుత్వ సంస్థ. అంతర్జాతీయ మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం వంటి అంశాలపై సభ్య దేశాలకు సిఫార్సులు చేస్తుంది. మన దేశం 2010 నుండీ ఈ సంస్థలో సభ్యురాలిగా ఉంటోంది. అట్టడుగు వర్గాల ప్రజలు, మైనారిటీలు, వాతావరణ మార్పులు వంటి వాటిపై పనిచేస్తున్న 16 స్వచ్ఛంద సంస్థలలో 11 సంస్థల లైసెన్సులను ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. విదేశీ నిధులు పొందాలంటే స్వచ్ఛంద సంస్థలకు ఈ లైసెన్సు తప్పనిసరి. గత దశాబ్ద కాలంలో దేశంలోని 20,600 ఎన్‌జీఓల లైసెన్సులు రద్దు చేశారు. 2022 నుండే ఆరు వేల సంస్థల లైసెన్సులు రద్దయ్యాయి. లైసెన్సుల రద్దుకు అధికారులు కుంటిసాకులు చెబుతున్నారు. ప్రభుత్వ సంస్థల ప్రతిష్టను దిగజారుస్తున్నాయని, ప్రజలు లేదా దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తు న్నాయని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్బంధాల కారణంగా అనేక ఎన్‌జీఓలు తమ సిబ్బంది సంఖ్యను 50-80% మేర తగ్గించుకుంటున్నాయని అమ్నెస్టీ తెలిపింది. ‘మా కార్యకలాపాలన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. మాకు వ్యతిరేకంగా పెట్టిన కేసుల విషయంలో న్యాయస్థానాలలో పోరాడడానికే పరిమితమయ్యాము’ అని ఓ ఎన్‌జీఓ నిర్వాహకుడు చెప్పారు.
చట్టాలను రద్దు చేయాలి : ఆమ్నెస్టీ
ఉపా, పీఎంఎల్‌ఏ, ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాలను రద్దు చేయాలని లేదా వాటిని అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా సవరించాలని ఆమ్నెస్టీ సిఫార్సు చేసింది. భీమా కోరెగావ్ కేసులో ముస్లిం విద్యార్థి ఉమర్ ఖలీద్, కాశ్మీర్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త ఖుర్రమ్ పర్వేజ్, పాత్రికేయుడు ఇర్ఫాన్ మెహ్రాజ్, మరో 16 మంది 2018 నుంచి ఎలాంటి విచారణ లేకుండా జైలులో మగ్గుతున్నారని, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశారంటూ వారిపై ఆరోపణలు మోపారని తెలిపింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు మోడీ ప్రభుత్వం పీఎంఎల్‌ఏను ఉపయోగించింది. దీంతో ఆ సంస్థ భారత్‌లో 2020 సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలను నిలిపివేసింది. ఇలాంటి చర్యల వెనుక ఉన్నది రాజకీయ ఉద్దేశాలేనని, అంతర్జాతీయ సంస్థల పట్ల వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించేందుకే ఇలా చేస్తున్నారని పటేల్ చెప్పారు.