దుర్మార్గాలు… దుష్ప్రచారాలు

– కేరళపై విషం చిమ్ముతున్న బీజేపీ నేతలు
– మోడీ నుండి ధన్‌కర్‌ వరకూ అదే తీరు
మానవాభివృద్ధి సహా పలు రంగాలలో రోల్‌మోడల్‌గా నిలిచిన కేరళ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేయని ప్రయత్నం అంటూ లేదు. కర్నాటక ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగిస్తున్న మోడీ రాష్ట్రంలో తమ ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలను ఏకరువు పెట్టడానికి బదులు ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. కేరళలోని 32 వేల మంది మహిళలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని, ఆ తర్వాత వారు ఐసిస్‌ ఉగ్రవాద సంస్థలో చేరారని ఆ చిత్రంలో చూపారు.అయితే దీనిపై వివాదం చెలరేగడంతో ’32 వేలు’ అనే సంఖ్యను టీజర్‌ నుండి తొలగిస్తామంటూ చిత్ర నిర్మాతలు కేరళ హైకోర్టుకు హామీ ఇచ్చారు. అయినప్పటికీ ప్రధాని మోడీ తన దుష్ప్రచారాన్ని మాత్రం ఆపలేదు.

న్యూఢిల్లీ :
మోడీ ‘సుభాషితాలు’ గురివిందగింజను గుర్తుకు తెస్తున్నాయి. 2002లో గుజరాత్‌లో జరిగిన మతోన్మాద హింసాకాండపై బీబీసీలో ప్రసారమైన డాక్యుమెంటరీ లింకును ట్విటర్‌, యూట్యూబ్‌లో పలువురు షేర్‌ చేయగా దానిని తొలగించాలంటూ మోడీ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దీనిని ప్రదర్శించిన కొందరు యూనివర్సిటీ విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు సైతం తీసుకుంది. అయితే బీబీసీ డాక్యుమెంటరీ ఎత్తిచూపిన వాస్తవాలను మాత్రం మోడీ ప్రభుత్వం ఎన్నడూ ఖండించలేదు. అదే ‘ది కేరళ స్టోరీ’ సినిమా విషయానికి వస్తే ’32 వేలు’ అనే సంఖ్యను తొలగించేందుకు నిర్మాతలు అంగీకరించినా ప్రధాని మాత్రం తన విమర్శల జడివాన ఆపడం లేదు.
కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న మోడీ కేరళ ప్రభుత్వంపై విషం చిమ్ముతుండటం వూచిత్రి. కేరళపై మోడీ ఆరోపణలు గుప్పించడం ఇది మొదటిసారి కాదు. 2016లో కేరళలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ కేరళ, సోమాలియాలలో పరిస్థితులను పోల్చారు. కేరళలో గిరిజన బాలల మరణాల రేటు సోమాలియాలో కంటే దారుణంగా ఉందని ఆరోపించారు. అయితే దీనిపై కేరళీయులు పెద్ద ఎత్తున ట్విటర్‌ వేదికగా మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోడీ వ్యాఖ్యలకు ఆధారాలు లేవని తెలిపారు. ఇంత జరిగినా కేరళపై మాత్రం ప్రధాని మోడీ నిరాధారమైన విమర్శలు చేయడం మానడం లేదు.
కేరళ, సోమాలియా పరిస్థితులను పోలుస్తూ మోడీ చేసిన వ్యాఖ్యలపై బీబీసీ 2016 మే 11న ఓ వార్తను ప్రసారం చేసింది. ‘సోమాలియాలో అధిక సంఖ్యలో పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచంలో చిన్నారుల మరణాలలో సోమాలియాదే అగ్రస్థానం. మరోవైపు భారత్‌లో అతి తక్కువగా పిల్లల మరణాలు నమోదవుతున్న రాష్ట్రం కేరళ. ఇందుకు భిన్నంగా అబద్దాలతో ఆ రాష్ట్ర ఓటర్లను ఆకర్షించేందుకు మోడీ చేసిన ప్రయత్నాలు చివరికి వికటించాయి’ అని వ్యాఖ్యానించింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రం విషయంలోనూ మోడీ చేస్తున్న వ్యాఖ్యలు ప్రధాని పదవి హుందాతనాన్ని ఏ విధంగానూ పెంచబోవు.
మోడీకి ముందు దేశానికి ప్రధానిగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ 2005 సెప్టెంబర్‌ 3న కేరళ అసెంబ్లీలో జాతి నేతల విగ్రహాలను ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆ రాష్ట్ర ఔన్నత్యాన్ని ప్రశంసించారు. ఆ ప్రసంగపాఠాన్ని మోడీ పరిశీలించడం మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఒక్క మోడీ మాత్రమే కాదు… కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా నేను సైతం అంటూ కర్నాటక ప్రచారంలో కేరళపై విషంకక్కారు. ‘కర్నాటక బీజేపీ చేతిలో మాత్రమే సురక్షితంగా ఉంటుంది. మీ సమీపంలోనే కేరళ ఉంది’ అంటూ నర్మగర్భంగా మాట్లాడారు. దీనిపై సీపీఐ (ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ మండిపడ్డారు. అమిత్‌ వ్యాఖ్యలు బీజేపీ అసహనానికి నిదర్శనమని ఆయన చెప్పారు. బ్రిట్టాస్‌ రాసిన ఓ వ్యాసంపై కేరళకు చెందిన బీజేపీ నాయకుడొకరు చేసిన ఫిర్యాదు ఆధారంగా రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ఆయన వివరణ కోరారు. అయితే ఒక సభ్యుడు వార్తాపత్రికలో రాసిన వ్యాసం ఆధారంగా ఆయనకు ఎలా నోటీసు ఇస్తారో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని అసాధారణ చర్యగా అభివర్ణిస్తున్నారు.
తప్పుడు ప్రచారాలతో, అంకెల గారడీతో బీజేపీ నాయకులు కేరళపై చేస్తున్న దుష్ప్రచారం ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ప్రజలకు మార్గదర్శనం చేయాల్సిన ప్రధానే ఇలాంటి కువిమర్శలకు దిగడం విచారకరం. వాస్తవాలను మరుగుపరిచే ఇలాంటి ప్రయత్నాలను కేరళ ప్రజలు తప్పనిసరిగా తిప్పికొడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Spread the love