నవతెలంగాణ – హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టుకు గాయం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ముంబై యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గేకు తొలిసారి భారత సీనియర్ జట్టులో చోటు కల్పించినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో వన్డే అనంతరం నితీశ్ ఎడమ తొడ కండరాల్లో అసౌకర్యం ఉన్నట్లు వైద్య బృందానికి తెలియజేశాడు. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం నిర్ధారణ కావడంతో అతడికి కొంతకాలం విశ్రాంతి, పునరావాసం అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. దీంతో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే రెండు టీ20 సిరీస్‌ల నుంచి అతడిని తప్పించారు.
ఇప్పటికే గాయం కారణంగా హార్దిక్ పాండ్య అందుబాటులో లేకపోవడంతో, నితీశ్ రెడ్డి జట్టులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తాడని భావించారు. ముఖ్యంగా బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్ బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్‌గా అతడు జట్టుకు బ్యాలెన్స్ తీసుకొచ్చే ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే గాయం కారణంగా అతడు టూర్‌కు దూరం కావడం సెలెక్టర్లకు నిరాశ కలిగించింది. ఇక నితీశ్ స్థానంలో ఎంపికైన 23 ఏండ్ల సూర్యాంశ్ షెడ్గే ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై-సిరీస్‌లో ఇండియా-ఏ తరఫున ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 147 పరుగులు చేయడంతో పాటు బంతితో కూడా రెండు వికెట్లు సాధించాడు. అలాగే 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 251.92 స్ట్రైక్‌రేట్‌తో 131 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.



