సీజనల్ ఫ్రూట్ అయిన సీతాఫలంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే శరీరంలో డోపమైన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ సూపర్‌ఫుడ్ వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. సీతాఫలంలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ఈ పండులో ఫైబర్ కూడా ఎక్కువే. ఇందులో నియాసిన్ విటమిన్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కాకపోతే షుగర్ పేషంట్లు ఈ పండును మితంగా తీసుకోవటమే మంచిది. ఎన్నో ప్రయోజనాలున్న ఈ పండుతో చేసే కొన్ని వెరైటీ రెసిపీలు…
రబ్డీ
చాలా సింపుల్‌గా రెడీ అయ్యే ఈ ఫ్యాన్సీ రెసిపీ తయారీ ఎలాగో చూద్దాం. సీతాఫలం వాడటం వల్ల తీపి కోసం ఎక్కువగా పంచదార వాడాల్సిన అవసరం లేకుండా హెల్తీగా ఉంటుంది. సీతాఫలం సీజన్ మొదలైనట్లే. ఈ పండ్లు పుష్కలంగా దొరికినప్పుడే ఒక్కసారన్నా ఈ స్వీట్ రెసిపీ ట్రై చేయండి. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు : పాలు – ఒక లీటర్, 1/4 కప్పు బెల్లం, 1/2 టీస్పూన్ యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు – ఒక కప్పు.
గార్నిష్ కోసం: గులాబీ రేకులు, పిస్తా తరుగు, కుంకుమపువ్వు కలిపిన పాలు కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా పాలను ఒక కడాయిలో వేసి మరిగించాలి. రెండు మూడు సార్లు బాగా ఉడుకు వచ్చాక మంట తగ్గించి సగానికి ఇంకిపోయి చిక్కబడే వరకు పాలను మరిగించాలి. మధ్య మధ్యలో కలియబెడుతూ మరగబెట్టాలి. లేదంటే పాలల్లో అడుగున చిన్న స్టీల్ ప్లేట్ వేసేస్తే పొంగకుండా ఉంటాయి. పాలు సగానికి ఇంకిపోయి చిక్కబడ్డ తర్వాత అందులో యాలకుల పొడి, బెల్లం లేదా పంచదార, సీతాఫలం గుజ్జు వేసి కలపాలి. బెల్లం వెస్తే బాగా కలిసేవరకూ తిప్పాలి. అది కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. చివరగా కుంకుమపువ్వు కలిపిన పాలు, గులాబీ రేకులు, పిస్తాపప్పులతో గార్నిష్ చేసుకోవాలి. కనీసం ఓ గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే అద్భుతమైన డెజర్ట్ రెడీ అవుతుంది.
ఐస్‌క్రీమ్
కావలసిన పదార్థాలు : సీతాఫలం గుజ్జు – 4 కప్పులు, పాలు – 2 కప్పులు, పంచదార పొడి – అర కప్పు, పాల పొడి – ఒక కప్పు, వెనిలా ఎసెన్స్ – ఒక స్పూను, తాజా క్రీమ్ – అరకప్పు.
తయారీ విధానం : ఒక పెద్ద పాత్రలో బాగా కాచి చల్లార్చిన పాలు, పంచదార పొడి, పాల పొడి, వెనిలా ఎసెన్స్ వేసి పంచదార కరిగి వరకూ బాగా కలపాలి. సీతాఫలం.. గుజ్జు జత చేసి, మరోమారు బాగా కలిపి లోతుగా ఉన్న పాత్రలో పోసి మూత పెట్టి, ఫ్రిజ్‌లో ఉంచాలి. సుమారు నాలుగు గంటల తరువాత బయటకు తీసి, మిక్సీలో వేసి, మెత్తగా చేయాలి. ఈ ఆ మిశ్రమాన్ని లోతుగా ఉన్న పాత్రలో పోసి, గాలి పోకుండా ఉండేలా మూతపెట్టాలి. డీప్ ఫ్రీజర్లో పెట్టి నాలుగైదు గంటల తరవాత తీసేయాలి. ఎంతో ఈజీగా సీతాఫలం ఐస్‌క్రీం సిద్ధమయినట్టే. కప్పులలో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే.
కేక్
కరిగించిన బటర్ – 1 టీ స్పూన్, పంచదార పొడి – 125 గ్రాములు, దాల్చిన చెక్క పొడి – కొద్దిగా. బటర్- 100 గ్రాములు, కోడిగుడ్లు-2, మైదా పిండి – ఒకటిన్నర కప్పులు, పాలు – 100 మి.లీ., సీతాఫలం గుజ్జు – 2 కప్పులు.
తయారీ విధానం : ముందుగా వెన్నను ఫ్రీ హీట్.. చేసుకోవాలి. పంచదారను మెత్తగా పొడి చేసుకోవాలి. మందంగా ఉన్న ఒక అల్యూమినియం పాత్రను తీసుకొని పంచదార, దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో బటర్ వేసి గిలకొట్టుకోవాలి. తర్వాత కోడి గుడ్లు కూడా వేసి బాగా నురగ వచ్చే వరకూ బాగా కలపాలి. ఆ తర్వాత మైదా పిండి కూడా వేసి బాగా గిలకొట్టాలి. అందులోనే సీతాఫలం గుజ్జు కూడా వేసి బాగా కలిపి ఈ పాత్రను హీట్ చేసిన ఓవెన్‌లో ఉంచాలి. సుమారు 45 నిమిషాల తర్వాత బయటకు తీయాలి. బాగా చల్లారిన తర్వాత కేక్‌ను పాత్ర నుంచి వేరు చేయాలి. దీనిని ముక్కలుగా కట్‌చేసుకోవటమే. ఎంతో ఈజీగా చేసుకునే సీతాఫల్ కేక్ రడీ అయినట్టే.
మిల్క్ షేక్
పాలు – 4 కప్పులు, డ్రైఫ్రూట్స్ పొడి అర కప్పు, పంచదార తగినంత, సీతాఫలం గుజు – రెండు కప్పులు.
తయారీవిధానం : మిక్సీలో సీరావులు గుజ్జు, పాలు, పంచదార, డ్రైఫ్రూట్స్ పొడి వేసి, మెత్తగా అయ్యే వరకూ మిక్సీ పట్టాలి. అంతే వాటిని గ్లాసులలో పోసి అందించాలి. కావాలనుకుంటే కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టినా… చల్లచల్లగా ఎంతో రుచిగా ఉంటుంది.