భారీగా పెరిగిన డిజిటల్ మోసాలు
పరిష్కారం చూపడంలో మోడీ సర్కార్ వైఫల్యం
సాంకేతికతపై తీవ్రమవుతున్న సవాళ్లు
కోట్ల రూపాయల్లో డబ్బులు కోల్పోతున్న బాధితులు
2024-25లో కొల్లగొట్టింది రూ.36 వేల కోట్లకు పైనే
గతేడాది పది నెలల్లో 24 లక్షల డిజిటల్ మోసాలు
భారత్‌లో పైసా పైసా కూడబెట్టుకున్న కష్టార్జితానికి కన్నీళ్లే మిగులుతున్నాయి. తాము డిజిటల్ మోసాల బారిన పడ్డామని తెలిశాక.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు మానసికంగా కుంగిపోతున్నారు. కృత్రిమ మేథ (ఏఐ)తో ఏదైనా సాధించవచ్చని ఓపక్క మోడీ సర్కార్ చెప్పుకుంటుంటే.. మరోపక్క డిజిటల్ మోసాలు యథేచ్ఛగా సాగుతున్నా పరిష్కార మార్గం చూపటం లేదనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నా అక్రమార్కుల భరతం పట్టేలా వ్యవస్థలు కదిలే పరిస్థితులు కనుచూపుమేరలో కానరావటంలేదు.
న్యూఢిల్లీ : దేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ బ్యాంకింగ్‌కు తోడు మోసాల రూపం కూడా మారుతోంది. సాంకేతికతక పెరిగే కొద్దీ భద్రతా సవాళ్లు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు, యూపీఐ సౌకర్యాలు భారత్‌లో మంచి మార్పును తీసుకొచ్చాయని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రచారాలు చేసుకుంటుంది. కానీ ఇవే సౌకర్యాలు ప్రజలను డిజిటల్ మోసాల బారిన కూడా పడేస్తున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బాధితులుగా మారుతున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వ్యవస్థలోనే లోపాలను ఆసరాగా చేసుకొని మోసగాళ్లు కూడా మరింత తెలివిగా మారుతున్నారు. కోట్ల రూపాయల మోసాలు బయటపడుతుండగా..
చిన్న చిన్న మోసాలు వేలల్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎంతో కష్టపడి, తమ కోసం, తమ పిల్లల భవిష్యత్ కోసం బ్యాంకులలో దాకుంటున్న డబ్బులు భద్రమేనా? అనే ప్రశ్నలు, అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి.
మోసాల కొత్త రూపం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. 2024-25లో బ్యాంకింగ్ మోసాలు రూ.36,014 కోట్లకు చేరుకున్నాయి. కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. నష్టం మాత్రం భారీగా పెరిగింది. మరోవైపు 2025లో మొదటి పది నెలల్లోనే సుమారు 24 లక్షల డిజిటల్ మోసాలు నమోదయ్యాయి. అయితే దేశంలో మోసాలు తగ్గడం లేదనీ, అవి మరింత తెలివిగా మారుతున్నాయని విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు.
వేగవంతమైన చెల్లింపులు.. కొత్త ప్రమాదాలు
యూపీఐ ద్వారా క్షణాల్లో డబ్బు బదిలీ అవుతుంది. ఖాతా ప్రారంభం సులభమైంది. లోన్లు కూడా త్వరగా లభిస్తున్నాయి. ఈ వేగం ప్రజలకు సమయాన్ని ఆదా చేసినా.. అది మోసగాళ్లకు కూడా సహాయపడుతోంది. డబ్బు వేగంగా వెళ్లిపోతే తిరిగి తెచ్చుకోవడం కష్టమనీ, ఫేక్ ఐడెంటిటీలు సులభంగా సిస్టంలోకి ప్రవేశించగలవనీ, స్మార్ట్‌ఫోన్‌లే మోసాలకు కేంద్రంగా మారుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
ఆధునిక పద్దతుల్లో మోసాలు
దేశంలో డిజిటల్ మోసాల తీరు మారుతోంది. ప్రస్తుతం ఈ మోసాలు కేవలం ఫోన్ కాల్స్, మెజేజెస్‌తో పరిమితం కావడం లేదు. ఫేక్ యూపీఐ రిక్వెస్ట్‌లు, నకిలీ కస్టమర్‌కేర్ నంబర్లు, ఫిషింగ్ లింకులు, ఓటీపీ మోసాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఇవి కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోసాలు కూడా కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయి. డీప్‌ఫేక్ వాయిస్‌లు, వీడియోలు, ఫిషింగ్ సందేశాలు, సింథటిక్ ఐడెంటిటీలు ఏఐ మోసాలలో కనిపిస్తున్నాయి. ఇలాంటి మోసాలను గుర్తించడం మరింత కష్టతరమైందని నిపుణులు వివరిస్తున్నారు.
బ్యాంకులు విఫలమవుతున్నాయా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దేశంలోని చాలా బ్యాంకులు ఇలాంటి మోసాలను ముందుగానే గుర్తించడంలో ఇంకా వెనుకబడి ఉన్నాయి. సాధారణంగా బాధితుడి డబ్బు పోయిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నాయి. భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇదే అంశంపై ప్రశ్నలు లేవనెత్తింది. సందేహాస్పద లావాదేవీలను వెంటనే ఎందుకు నిలిపివేయలేకపోతున్నారు? అని బ్యాంకులు, సంబంధిత యంత్రాంగాలను ప్రశ్నించింది. కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యవస్థలతోనే సుమారు రూ.1120 కోట్ల నష్టం నివారించవచ్చని ఒక అంచనా.
మోసాలకు ఊతమిస్తున్న ఏఐ
ఏఐతో ఎన్ని లాభాలున్నాయో.. అన్ని నష్టాలూ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న ఏఐ.. మోసగాళ్లకు ఒక ఆయుధంగా మారిందని అంటున్నారు. దీంతో ఏఐ కారణంగా మోసాలు వేగంగా, భారీ స్థాయిలో జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇవి కేవలం సాంకేతిక సమస్యలు కావనీ, సాధారణ వినియోగదారులపై నేరుగు ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఇలాంటివి మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
ముందున్న మార్గమేంటి?
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు అనివార్యం. ఇందుకు అవి కొన్ని చర్యలను తప్పక తీసుకోవాలి. ఇందులో భాగంగా.. రియల్-టైమ్ ఫ్రాడ్ డిటెక్షన్ వ్యవస్థలు, బలమైన ఐడెంటిటీ వెరిఫికేషన్, వేగవంతమైన ఫిర్యాదు పరిష్కారం, వినియోగదారు లకు అవగాహన పెంచడం వంటివి చేయాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించిన రూ.10వేలకు పైగా లావాదేవీలకు ఒక గంట ‘కూలింగ్ పీరియడ్’ వంటి చర్యలు భద్రతను పెంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కష్టార్జితానికి కన్నీళ్లు
- Advertisement -
- Advertisement -



