- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్: ఉపాధి హామీ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనికి కార్మికులను దూరం చేసే ఈ కేవైసీని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి వారు సూచించారు. బుధవారం మోటకొండూర్ మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం నర్సింహ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో పనిస్తున్న కూలీలకు రోజు కూలీ ఎంతనో కూడా తెలియని అయోమయ పరిస్థితులలో ఉన్నారని, రోజు కూలీ ఎంతనో తెలియజేసే పే స్లిప్పులు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా వారం వారం కూలీలకు పే స్లిప్పులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూలీలను అడిగినప్పుడు 150 నుంచి 200 రూపాయలు ఇస్తున్నారని చెప్తున్నారని మరి ప్రభుత్వం నిర్ణయించిన 307 రూపాయలన్నా ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు.
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-కేవైసీ వల్ల చాలామంది కూలీలు ఉపాధికి దూరమవుతున్నారనీ వెంటనే ఉపాధి హామీ ఈ- కేవైసీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో మౌలిక వసతులను కల్పించి, ప్రమాద బీమా సౌకర్యం కూడా కూలీలకు అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. కల్లుగీత కార్మిక జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని జయరాములు మాట్లాడుతూ మోటకొండూరు మండలం సాగునీరు వసతి లేక వ్యవసాయం లేక చాలామంది వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరకడం లేదని ప్రభుత్వము కనీసం ఉపాధి హామీలో 200 రోజుల పని దినాలు కల్పించి అందరికీ పని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూమిలేని పేదలకు 12 వేల రూపాయలు ఇస్తానన్న హామీని కూడా అమలు చేయాలని కోరారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన విబి-జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కొల్లూరు ఆంజనేయులు, టెక్నికల్ అసిస్టెంట్ ఏ. మంగ, మేటు హరిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం కొల్లూరి శ్రీహరి, సుధాకర్, రమేష్, నాగరాజ్, గాదుల శ్రీను, సత్యలక్ష్మి, జ్యోతి, అశ్విని, గణేష్ పద్మ, రజిని, సరిత, దివ్య, మల్లేష్ జహంగీర్, మల్లయ్య, నరసింహులు, బాల నరసింహ, మానస, లక్ష్మి, అఖిల, భాగ్యలక్ష్మి బాలమణి, లింగమ్మ, మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.




