అమర్‌నాథ్ యాత్ర తాత్కాలిక నిలుపుదల

నవతెలంగాణ – న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీరులో వాతావరణం అనుకూలించకపోవడంతో అమర్‌నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. శుక్రవారం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరలింగేశ్వరుని దర్శనం చేసుకోవడానికి శుక్రవారం ఉదయం నుంచి భక్తులను అనుమతించడం లేదు. వాతావరణ పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఈ యాత్రను పునరుద్ధరిస్తారు. జమ్మూ-కశ్మీరు రాజధాని శ్రీనగర్ నుంచి 141 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టం నుంచి 12,756 అడుగుల ఎత్తులో అమర్‌నాథ్ ఉంది. ఇక్కడి మంచు కొండల్లోని అమరలింగేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తారు. జూలై 1 నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఆగస్టు 31తో ముగుస్తుంది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్, గండేర్‌బల్ జిల్లాలోని బల్తల్ మార్గాల్లో ఈ యాత్రకు వెళ్లవచ్చు. భక్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. గురువారం 17,202 మంది భక్తులు అమరలింగేశ్వరుని దర్శించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 84,768 మంది భక్తులు సహజసిద్ధ మంచు లింగం రూపంలోని అమరలింగేశ్వరుని దర్శనం చేసుకున్నారు. బల్తల్, పహల్గామ్ మార్గాల్లో శుక్రవారం 7,010 మంది భక్తులు ఉన్నారు. వీరిలో 5,179 మంది పురుషులు, 1,549 మంది మహిళలు, 21 మంది బాలలు, 228 మంది సాధువులు ఉన్నారు.

Spread the love