రేపటి నుండి ‘పది’ పరీక్షలు ప్రారంభం

నవతెలంగాణ – పెద్దవంగర
పదో తరగతి వార్షిక పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. మండల పరిధిలోని 5 జెడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులతో పాటుగా, కేజీబీవీ విద్యార్థులు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగే పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఎస్ బీ. వెంకటేశ్వర్ రావు, డీవో వినోద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల పరిధిలోని పెద్దవంగర జెడ్పీ ఉన్నత పాఠశాల 51, అవుతాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల 25, వడ్డెకొత్తపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల 15, బొమ్మకల్ జెడ్పీ ఉన్నత 10, చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాల 25 మంది విద్యార్థులు, కేజీబీవీ నుండి 38 విద్యార్థులు, మొత్తం ఆరు పాఠశాలల నుండి 164 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులను 8 గంటల 30 నిమిషాలకు పరీక్ష కేంద్రంలోకి పంపిస్తామని, 9 గంటల 30 నిమిషాలకు పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు. ఈ సంవత్సరం నిమిషము నిబంధనలను సడలించి, పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. పరీక్షలు నిస్పక్షపాతంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.
Spread the love