ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు పదేండ్ల స్వయం ప్రతిపత్తి

– కలిసొచ్చిన న్యాక్‌, ఎన్‌బీఎ గుర్తింపు
– శతాబ్ది వైపు శరవేగంగా అడుగులు
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మరొక 4 ఏండ్లలో శతాబ్ది ఉత్సవాలు చేసుకునే దిశగా అడుగులు వేయబోతుంది. ఈ తరుణంలో అరుదైన ఘనతను అందిపుచ్చుకుంది. పదేండ్లపాటు యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదాను సాధించింది. 1929లో స్థాపించిన ఈ కళాశాలకు గతంలో రెండు సార్లు ఆరేండ్ల చొప్పున అటానమస్‌ (స్వయం ప్రతిపత్తి) గుర్తింపు దక్కింది. తాజాగా ఒకేసారి పదేండ్ల గుర్తింపు దక్కించుకుంది. ఈ మేరకు యూజీసీ ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రిన్సిపాల్‌ ప్రొ.శ్రీరాం వెంకటేష్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓయూకు న్యాక్‌ ఏ ప్లస్‌ గుర్తింపు ఉండటం, ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉన్న అన్ని విభాగాలకు ”నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌” (ఎన్‌బీఏ) గుర్తింపు సాధించటం లాంటి అంశాలను యూజీసీ పరిగణనలోకి తీసుకోవడం కలిసి వచ్చిందని ప్రిన్సిపాల్‌ తెలిపారు.
సందర్శించకుండానే గుర్తింపు.. ఇది తొలిసారి
ఇంజినీరింగ్‌ కళాశాలలను యూజీసీ టీమ్స్‌ సందర్శించకుండానే గుర్తింపు ఇవ్వడం ఒకెత్తు అయితే.. పదేండ్ల పాటు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తూ యూజీసీ నిర్ణయం తీసుకోవడం మరొక ఎత్తు. స్వయం ప్రతిపత్తికి కావాల్సిన డాక్యుమెంట్స్‌ (అర్హత పత్రాలు), ఆన్‌లైన్‌ ద్వారా చేరవేయడంతో పరిశీలించి గుర్తింపు ఇచ్చినట్టు అధ్యాపకులు తెలిపారు. ఫలితంగా 2022-23 నుంచి 2031-32 వరకు స్వయం ప్రతిపత్తి అమల్లో ఉంటుంది. ఇంత సుదీర్ఘ కాలం అటానమస్‌ హౌదా కలిగిన కళాశాలలు దేశంలోనే అతి స్వల్పమని కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
ఇక స్వేచ్ఛతో ముందుకు
తమ కళాశాలకు దక్కిన ఈ హోదాతో కోర్సులు, సిలబస్‌ రూపకల్పన అంశాల్లో స్వేచ్ఛ ఉంటుందని, పరిశోధన ప్రాజెక్టుల్లోనూ ప్రాధాన్యత ఉంటుందని ప్రొ. శ్రీరాం వెంకటేశ్‌ అన్నారు. కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు పనులు ప్రారంభించడంతోపాటు ఆధునిక కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చామని ఓయూ వీసీ ప్రొ.రవిందర్‌, రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మీనారాయణ తెలిపారు. స్వయం ప్రతిపత్తి హోదా దక్కడం కళాశాల అధ్యాపకుల, ఉద్యోగుల సమిష్టి కృషి అన్నారు.
సాధించిన ఘనత, గుర్తింపులు
2021-2022లో 9 పీజీ కోర్సులకు, 6 యూజీ కోర్సు లకు 2025 వరకు ఎన్‌బీఎ అక్రిడిటేషన్‌ జారీ అయింది. నాణ్యమైన విద్యా సేవాలు, వసతి గృహాల, కార్యాలయ నిర్వహణలు, సజావుగా పరీక్షల నిర్వహణ, సకాలంలో ఫలితాల జారీ, విద్యార్థుల భద్రత, క్యాంటీన్‌ ద్వారా నాణ్యమైన ఆహారం ఇవ్వన్నీ పరిగణనలోకి తీసుకుని ఇంట ర్నేషనల్‌ స్టాండెడ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎస్‌ఓ), 9001 : 2015, 14001-2015, 50001-2018 గుర్తింపు పొందింది. ఓయూ మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగం రెండు అరుదైన ”చైర్స్‌” 6 నెలల వ్యవధిలో వంశం చేసుకుంది. ఈసీఈ విభాగంలో ”ఇన్‌ టెక్‌”ను 50 నుంచి 60 వరకు, బీఎంఈ ఇన్‌ టెక్‌ను 30 నుంచి 40 వరకు పెంపొందించారు.
శతాబ్ది సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలు
రూ.38 కోట్లతో అబ్బాయిలకు 500 బెడ్స్‌ సామర్థ్యంతో కిన్నెర వసతి గృహం నిర్మాణంలో ఉంది. రూ.2 కోట్లతో ఈసీఈ క్లాస్‌ రూమ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం జరుగుతోంది. విద్యార్థుల అన్ని రకాల సర్టిఫికేట్స్‌ను డిజిటల్‌ లాకర్‌లో ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐడీపీ విజన్‌ డాక్యుమెంట్స్‌ను 2029 వరకు సన్నద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రూ.24 కోట్లతో సీఎస్‌ఈ, మైనింగ్‌, ఎలక్ట్రికల్‌ విభాగాలకు అల్యూమినీ, కళాశాల నిధులతో క్లాస్‌ రూమ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేయనున్నారు. రూ.2 కోట్లతో నూతన క్యాంటీన్‌ నిర్మాణం. అమ్మాయిల వసతి గృహంలో జిమ్‌ ఏర్పాటు. వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం రానున్న విద్యా సంవత్సరం నుంచి అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు నిర్వహించనున్నారు.

Spread the love