– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కి ఆయిల్‌పామ్ రైతుల వినతి
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణలో ఎఫ్ ఎఫ్ బి(ఆయిల్‌పామ్ తాజా గెలల ) సేకరణ కేంద్రాలను టీజీఓయిల్ఫెడ్ ఆధ్వర్యంలో స్పష్టమైన మార్గదర్శకాలతో ఏర్పాటు చేసి నియంత్రించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి గురువారం హైదరాబాద్ లో ఆయిల్‌పామ్ రైతులు మద్దినేని వెంకటేశ్వర్లు,బండి భాస్కర్ రావు లు వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు, తాజా గెలల ఉత్పత్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రైతులు రవాణా, ఫ్యాక్టరీల వద్ద నిరీక్షణ, గెలల నాణ్యత తగ్గుదల వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. రైతులకు సమీపంలో సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తే గెలలను సకాలంలో తరలించడం సాధ్యమై నాణ్యత నష్టం తగ్గుతుందని తెలిపారు.
రైతుల ప్రధాన డిమాండ్లు:
* సేకరణ కేంద్రాలను టీజీఓయిల్ఫెడ్ నేరుగా లేదా ఈ-టెండర్ల ద్వారా స్పష్టమైన నిబంధనలతో నిర్వహించాలి.
* ప్రతి కేంద్రంలో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు ఏర్పాటు చేసి, ఎఫ్ – కోడ్‌కు అనుసంధానమైన రసీదును వెంటనే రైతుకు అందించాలి.
* పారదర్శకత కోసం సీసీటీవీ కెమెరాలు, వాహనాల జీపీఎస్ పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి.
* రైతువారీగా గెలల పరిమాణం, తేదీ, సమయం, వాహన వివరాలు, తూకం వివరాలను నమోదు చేయాలి.
* సేకరణ కేంద్రం నుంచి ఫ్యాక్టరీకి రవాణా టీజీఓయిల్ఫెడ్ గుర్తించిన అధికారిక రవాణా ఏజెంట్ల ద్వారానే జరగాలి.
* సేకరించిన గెలలను 24 గంటల్లోపు ఫ్యాక్టరీకి తరలించి నాణ్యత తగ్గకుండా చూడాలి.
* లోడింగ్, డిస్పాచ్ షెడ్యూళ్లను అమలు చేసి వాహనాల నిరీక్షణ సమయాన్ని తగ్గించాలి.
* ప్రతి సేకరణ కేంద్రానికి పరిధి, రైతుల జాబితా, F-కోడ్లను ముందుగానే ఖరారు చేయాలి.
ఈ మార్గదర్శకాలు అమలైతే కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితమైన తూకం, సకాలంలో రవాణా, తాజా గెలల నాణ్యత పరిరక్షణతో పాటు రైతులకు మెరుగైన సేవలు అందుతాయని రైతులు వినతిపత్రంలో పేర్కొన్నారు. టీజీఓయిల్ఫెడ్ ఆధ్వర్యంలో సేకరణ కేంద్రాల ఏర్పాటుకు తక్షణమే మార్గదర్శకాలు రూపొందించి ఈ – టెండర్ల ప్రక్రియ చేపట్టాలని మంత్రిని వారు కోరారు.



