పంటలు నాశనం చేస్తున్నా పట్టించుకోరా? |
రైతుల ధర్నా..అధికారులకు వినతి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో పందుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పందులు పంట పొలాల్లోకి చొరబడి పంటలను తొక్కి,తిని నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.పంటలు చేతికొచ్చే సమయంలో నష్టం వాటిల్లుతుండటంతో ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు.
పందుల బెడదను అరికట్టి,తమ పంటలను కాపాడాలని కోరుతూ గ్రామ సర్పంచ్ ఏసిరెడ్డి మంజుల మహేందర్‌రెడ్డి,రైతులు గురువారం ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.అనంతరం తహసీల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు.పంట నష్టానికి కారణమవుతున్న పందుల సమస్యపై చట్టపరమైన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు.
అదేవిధంగా ఆలేరు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ ఉదయ్‌కిరణ్‌కు కూడా రైతులు ఫిర్యాదు చేశారు రైతుల పంటలకు నష్టం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఆంజనేయులు,ఎస్‌హెచ్‌ఓ ఉదయ్‌కిరణ్ హామీ ఇచ్చారు.కార్యక్రమంలో గుండ్లగూడెం గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు,రైతులు,గ్రామ పెద్దలు,యువకులు పాల్గొన్నారు.



