చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తలసాని

నవతెలంగాణ-హైదరాబాద్ : కొవిడ్ నేపథ్యంలో మూడేళ్లపాటు నిలిచిన చేప ప్రసాదం పంపిణీ తిరిగి ప్రారంభమైంది. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటగా ఓ బాలుడికి చేప మందు వేశారు. చేప మందు కోసం తెలుగు రాష్ట్రాలతో సహా దేశం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో లక్షలాదిమంది చేప ప్రసాదం తీసుకోనున్నట్టు అంచనా. ‘చేప మందు పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబానికి కృతజ్ఞతలు. చేప ప్రసాదం ఆస్తమా, ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. విదేశాల్లో సైతం చేప మందుకు మంచి ప్రాధాన్యత ఉంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు చేప ప్రసాదం పంపిణీ ఘనంగా చేస్తున్నాం. ఈ రోజు చేప తినాలి అనే ఒక ఆనవాయితీ ఉంది. ప్రసాదం కోసం వచ్చే ప్రతీ ఒక్కరికీ చేప మందు అందిస్తాం.’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Spread the love