అమ్మాయిలదే హవా

– అబ్బాయిల కంటే 8.01 శాతం అధికంగా ఉత్తీర్ణత
– పాలిసెట్‌లో 82.17 శాతం మంది అర్హత
– ఎంపీసీలో సురభి శరణ్య టాపర్‌
– ఎంబైపీసీలో చీర్ల ఆకాశ్‌ ప్రథమం
– ఫలితాలు విడుదల చేసిన నవీన్‌ మిట్టల్‌
 – జూన్‌ 14 నుంచి పాలిటెక్నిక్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరంలో పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పాలిసెట్‌) ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాలిసెట్‌కు 1,05,742 మంది దరఖాస్తు చేస్తే, 98,274 మంది అభ్యర్థులు రాతపరీక్షకు హాజరయ్యారని వివరించారు. వారిలో 80,752 (82.17 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారని చెప్పారు. ఇందులో అబ్బాయిలు 58,520 మంది దరఖాస్తు చేయగా, 54,700 పరీక్షకు హాజరయ్యారని వివరించారు. వారిలో 43,006 మంది (78.62 శాతం) మంది అర్హత సాధించారని అన్నారు. 47,222 మంది అమ్మాయిలు దరఖాస్తు చేస్తే, 43,574 మంది పరీక్ష రాశారని చెప్పారు. వారిలో 37,746 (86.63 శాతం) మంది ఉత్తీర్ణత పొందారని అన్నారు. పాలిసెట్‌లోనూ అమ్మాయిలే హవా కొనసాగించారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు 8.01 శాతం అధికంగా ఉత్తీర్ణత పొందడం గమనార్హం. పాలిసెట్‌లో కనీసం 30 శాతం అంటే 36 మార్కులొస్తేనే అర్హత సాధిస్తారని నవీన్‌ మిట్టల్‌ చెప్పారు. ఎస్సీ,ఎస్టీలు మాత్రం ఒక మార్కు సాధించినా అర్హులవుతారని వివరించారు. 17,093 మంది ఎస్సీలు పరీక్ష రాయగా, 17,091 మంది అర్హత పొందారని, ఇద్దరు అర్హత పొందలేదని చెప్పారు. 7,861 మంది ఎస్టీలు పరీక్ష రాస్తే, వారందరూ ర్యాంకులు సాధించారని అన్నారు. ఎంపీసీ విభాగంలో సూర్యాపేటకు చెందిన సురభి శరణ్య 120కి 119 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారని చెప్పారు. అదే జిల్లాకు చెందిన షేక్‌ అబుబాకర్‌ సిద్దిఖ్‌ 119 మార్కులతో రెండు ర్యాంకు, 118 మార్కులతో మెదక్‌ చెందిన గౌడిచర్ల ప్రియాన్ష్‌ కుమార్‌, హైదరాబాద్‌కు చెందిన ప్రొద్దటూరి ప్రణీత్‌, సూర్యాపేటకు చెందిన కైరోజు శశివర్ధన్‌ మూడో ర్యాంకు పొందారని వివరించారు. ఎంబైపీసీ విభాగంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన చీర్ల ఆకాశ్‌ 120కి 116 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించారని చెప్పారు. 116 మార్కులతో సూర్యాపేటకు చెందిన మిరియాల అక్షయతార రెండో ర్యాంకు, అదే జిల్లాకు చెందిన కైరోజు శశివర్ధన్‌ మూడో ర్యాంకు పొందారని అన్నారు. పాలిసెట్‌ ఫలితాల కోసం tspolycet.nic.in వెబ్‌సైట్లను చూడాలని కోరారు. పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ కాలే జీలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవ సాయ విశ్వవిద్యాలయం (పీజేఎస్టీఏయూ), శ్రీకొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ), పివి నరసింహారావు తెలంగా ణ పశుసంవర్ధక విశ్వవిద్యాలయం (పీవీఎన్‌ ఆర్‌ టీవీయూ) లో డిప్లొమా కోర్సులతోపాటు నాన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని వివరించారు.
జూన్‌ 14 నుంచి పాలిటెక్నిక్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌
పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ ప్రక్రియ వచ్చేనెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని నవీన్‌ మిట్టల్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌ ను విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్‌ బుకింగ్‌ వంటి ప్రక్రియను వచ్చేనెల 14 నుంచి 18వ తేదీ వరకు చేపట్టాలని సూచించారు. వచ్చేనెల 16 నుంచి 19వ తేదీ వరకు ధ్రువపత్రాల పత్రాల పరిశీలన నిర్వహిస్తామని వివరించారు. 16 నుంచి 21వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని అన్నారు. వచ్చేనెల 25న తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. 25 నుంచి 29వ తేదీ వరకు ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. జులై ఒకటి నుంచి తుదివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రెండో తేదీన ధ్రువ పత్రాల పరిశీలన, ఒకటి నుంచి మూడు వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియను చేపట్టాలని కోరారు. ఏడో తేదీన సీట్లు కేటాయిస్తామన్నారు. ఏడు నుంచి పదో తేదీ వరకు ఫీజు చెల్లింపుతోపాటు వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. జులై 12వ తేదీ వరకు కేటాయిం చిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్టు చేయాలని కోరారు. అదేనెల ఏడో తేదీ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమవు తుందని వివరించారు. 14వ తేదీ వరకు ఓరియెంటేషన్‌ తరగతులుంటాయని చెప్పారు. జులై 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు. అదేనెల ఏడో తేదీన స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు https://polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌ ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా, రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి పుల్లయ్య, సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ డాక్టర్‌ సి శ్రీనాథ్‌, ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
కొత్తగా మూడు పాలిటెక్నిక్‌ కాలేజీలు
రాష్ట్రంలో కొత్తగా మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలు మంజూరయ్యాయని నవీన్‌ మిట్టల్‌ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌, మహేశ్వరంలో ఈ కాలేజీలను ప్రారంభిస్తామని అన్నారు. గత విద్యాసంవత్సరంలో 56 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 12,090 సీట్లు, 64 ప్రయివేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 17,600 సీట్లు కలిపి మొత్తం 29,690 సీట్లున్నాయని వివరించారు.

Spread the love