– పోలీసు దాడులు సరికాదు : ఎస్.వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహబూబాబాద్‌లో గుడిసెవాసులపై పోలీసులు మరోసారి దాడి చేయడం దారుణమని తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్.వీరయ్య పేర్కొన్నారు. గుడిసెవాసులపై కలెక్టరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మళ్లీ 30 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. ‘గుడిసెల కేంద్రం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికైనా కలెక్టర్ తన ధోరణి మానుకోవాలి. అరవై శాతం గిరిజన, దళిత జనాభా ఉన్న జిల్లాకు కలెక్టర్‌గా ఉన్న అధికారి ఇలా వ్యవహరించటం తగదు. కలెక్టర్ పేదల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. 170 ఎకరాల ప్రభుత్వ భూమిమీద కన్నేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర కబ్జాకోర్ల కోసం పేదలను వెంటాడుతున్నారు. గుడిసెవాసుల్లో ఎక్కువగా గిరిజనులు, దళితులు, వెనుకబడిన సామాజిక తరగతుల వారే ఉన్నారు. వారిపై అణచివేత ధోరణి సరిగాదు. తక్షణమే ఇండ్ల స్థలాల కోసం పేదల నుంచి దరఖాస్తులు తీసుకోవాలి. అర్హులైన పేదలకు స్థలం కేటాయించాలి’ అని పేర్కొన్నారు. గుడిసెల నుంచి పేదలను తొలగించేలా దాడులు కొనసాగిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య అక్కడి పేదలను పరామర్శించారనీ, మంత్రి సత్యవతి రాథోడ్‌కు పరిస్థితిని వివరించారని తెలిపారు. గుడిసెవాసులు వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.