ప్రభుత్వం మెప్పు కోసమే సీఐటీయూ నాయకుల అరెస్టులు

– సీఐటియు పేరు వింటేనే భయంతో వణికిపోతున్న మంత్రులు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వం మెప్పు కోసమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ముఖ్యంగా భద్రాచలం పట్టణ పోలీసులు సీఐటియు నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఈ అరెస్టులను సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేబ్రహ్మచారి, ఏజె రమేష్‌ తెలిపారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేసే విధంగా పోలీస్‌ అధికారులు కార్మికులను మంత్రులకు కలిసి వినతి పత్రం అందించే అవకాశం కల్పించాలి గాని మంత్రుల మెప్పుకోసం కార్మికుల గొంతు నొక్కే పని చేయటం ఎంతవరకు సమంజసమో పోలీస్‌ అధికారులు ఆలోచించుకోవాలని సిఐటియు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారని అలాగే గిరిజన హాస్టల్‌ వర్కర్లు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌ వర్కర్లు గ్రామపంచాయతీ వర్కర్లు వారి వారి సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నారని ఆ సమస్యలను పరిష్కారం చేయటం చేతగాక ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి సమ్మెను విచ్ఛినం చేయడం కోసం పోరాటాలను అణిచి వేయడం కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తుందని సిఐటియు పేర్కొన్నది. సీఐటియు పేరు వినపడితేనే రాష్ట్రంలో మంత్రులకు వెన్నులో వణుకు పుడుతుందని ఆ భయంతోటే సిఐటియు నాయకులని మంత్రులు ఎక్కడికెళ్తే అక్కడ పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని సిఐటియు పేర్కొన్నది. కార్మికుల తరఫున అండగా నిలబడుతున్న సిపిఎం, సిపిఐ నాయకులను అరెస్టులు చేయడానికి సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు అరెస్టులకు నిరసనగా జిల్లాలోని అన్ని కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు ఆందోళన పోరాటాలని చేయాలని పిలుపునిచ్చారు. అరెస్టులు చేయడం ద్వారా కార్మికులను మరింత రెచ్చగొట్టే చర్యలకు పోలీసులు ప్రభుత్వమే కారణమవుతుందని తద్వారా మరింత ఉధృతంగా సమ్మెలో పోరాటాలు జరుగుతాయనేది మంత్రులు పోలీస్‌ అధికారులు గుర్తించాలని సీఐటియు విజ్ఞప్తి చేసింది. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని రాష్ట్రస్థాయిలో సమస్యలపై పోరాడుతున్న సంఘాలతోటి చర్చలు జరిపే ప్రక్రియకు ప్రభుత్వం ముందుకు రావాలని సిఐటియు విజ్ఞప్తి చేసింది.
ప్రతిపక్ష నాయకుల అరెస్టు దుర్మార్గం
కేటీఆర్‌ రాక సందర్భంగా కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, తెలుగుదేశం, సీపీఐ ఎంఎల్‌ ప్రజపంథా, ప్రజాసంఘాల నాయకులను జిల్లా పోలీస్‌ యంత్రాంగం వారు అక్రమ అరెస్టులు చేసి దుమ్ముగూడెం పోలీస్‌ స్టేషన్‌ కి తరలించడం దారుణం అని మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఉపాధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున నాయకుల అక్రమ అరెస్టులు ఖండిస్తున్నామని కొడాలి శ్రీనివాసన్‌ తెలిపారు.

Spread the love