రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

నవతెలంగాణ – పెద్దవంగర
బైక్ అదుపుతప్పి.. చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామానికి చెందిన బొజ్జ సరిత-శ్రీనివాస్ (లేట్) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అరుణ్ కుమార్ (20) తొర్రూరు లోని ఓ ప్రయివేటు కళాశాలలో ఐటీఐ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పదేండ్ల కింద అరుణ్ కుమార్ తండ్రి శ్రీనివాస్ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, తల్లి సరిత ఇద్దరి కుమారులను తీసుకొని జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగాపురం గ్రామమైన తల్లి గారి ఇంటి వద్దనే నివాసం ఉంటుంది. గత ఐదేళ్ల కిత్రం చిన్న కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మనస్తాపం చెందిన సరిత అక్కడి నుంచి హైదరాబాద్ కు వలస వెళ్లి, రోజువారీ పనులు చేసుకుంటూ, జీవనం సాగిస్తుంది. కాగా తన తల్లిగారి ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్న అరుణ్, రెండు రోజులు సెలవులు కావడంతో ఆదివారం రాత్రి చిట్యాల గ్రామంలోని తన స్నేహితులను కలిసి తిరిగి వెళుతున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారు మూల మలుపు వద్ద బైక్ కు అదుపుతప్పి తుమ్మ చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో అరుణ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున అటుగా వెళ్తున్న రైతులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడి తల్లికి సమాచారం అందించారు. తల్లి సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు మృతుడి కుటుంబానికి అప్పగించారు.
Spread the love