ఇంటర్ లో ఫెయిల్… విద్యార్థిని ఆత్మహత్య

– చిట్యాల గ్రామంలో విషాదం
నవతెలంగాణ – పెద్దవంగర
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపానికి గురై ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై మహేష్, కుటుంబ సభ్యులు తెలిపి వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన ఈదురు రామనర్సయ్య- సునిత దంపతులకు కుమారులు ప్రవీణ్, ప్రభాకర్, కుమార్తె ప్రవళిక సంతానం. గ్రామంలో తమకున్న కొద్దిపాటి పొలం సాగుతో పాటుగా, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కూతురు ప్రవళిక (16) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ (పీఎస్టీటీ గ్రూప్) చదువుతుంది. బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఆమె ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రవళిక తమ్ముడు కొంత సేపటి తరువాత ఇంటికి రాగానే ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన అక్క ను చూసి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని కిందకు దింపారు. వెంటనే కుటుంబ సభ్యులు తొర్రూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Spread the love