చికెన్ వండుకొనగలమా.!

– ఉత్పత్తి లేక ధర పైపైకి
– రూ.300 పైగా పలుకుతున్న చికెన్ ధర
– ఉష్ణోగ్రతల కారణంగా పెంపకానికి వెనుకంజ
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రస్తుతం చికెన్ కు ఉన్న డిమాండ్ కు తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి జరగడం లేదు. మార్కెట్ లో వ్యాపారుల నుంచి ఆర్డర్ లు పెరగడంతో అందుకు అనుగుణంగా ఉత్పత్తులు లేకపోవడంతో కంపెనీలు రేట్లు పెంచుతున్నాయి. పరిశ్రమల వద్ద లైవ్ బర్ద్ ధర పెరగడంతో దాని ప్రభావం చికెన్ ధరపై పడుతోంది. నెల రోజుల క్రితం తెలంగాణ కుంభమేళాగా జరిగిన మేడారం జాతరలో కోళ్లు, చికెన్ ధరలు పెరిగాయి.జాతర తరువాత తగ్గిన చికెన్ ధరలు మళ్ళీ పెరిగాయి. నెల రోజులకు పైగా వివాహాలు, గృహ ప్రవేశాలు ఇతర శుభకార్యాలు జరుగుతుండటంతో మాంసహారాల వినియోగం బాగా పెరిగింది. మండల కేంద్రమైన తాడిచెర్లతోపాటు అన్ని గ్రామాల్లో రోజుకు సుమారుగా రోజుకు 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు, శుభకార్యాల సమయంలో అదనంగా చికెన్ వినియోగం జరుగుతున్నట్లుగా అంచనా. వాడకానికి తగిన కోళ్ల ఉత్పత్తి జరగడం లేదు. ఉష్ణోగ్రతలు, గత అనుభవాల కారణాలతో కోళ్ల పెంపకం పరిశ్రమ తగ్గినట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ వాడాకానికి తగిన ఉత్పత్తి కాకపోవడంతో ధరలు పైపైకి వెళుతున్నట్లుగా,ప్రస్తుతం చికెన్ ధర రూ.300, కిలో కోడి రూ.220 పలుకుతోంది.
పండుగలు..పెళ్లిళ్లతో..
ప్రస్తుతం హిందూ, ముస్లిం పండుగలైన ఉగాది, రంజాన్ లు ఓవైపు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్ బాగా డిమాండ్ పెరిగింది. మంగళవారం ఉగాది, గురు, శుక్రవారాల్లో రంజాన్ పండుగ కావడంతో చికెన్ వ్యాపారుల నుంచి ఆర్డర్ లు బాగా పెరిగాయి. ఇదే తరుణంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో ప్రతి ఇంటా పోచమ్మ, ఉప్పలమ్మ వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో చికెన్ ధరలు పెరుగుతున్నాయి. మొక్కజొన్న వంటి పంటలు తగ్గడంతో దాన ధర పెరిగింది. ఇక హెచరిస్ లో కోడి పిల్లల ధర పెరిగింది. రూ.25 నుంచి రూ.30 ఉన్న కోడిపిల్ల ధర ప్రస్తుతం రూ.53 పలుకుతోంది. ఇక నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ప్రస్తుతం 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో కోళ్లు తట్టుకోవు.ఉష్ణోగ్రతలు, వడగాల్పుల కాలం కావడంతో కోళ్ల పరిశ్రమకు నష్టం జరుగుతుందని భావించి నిర్వాహకులు, రైతులు కోళ్ల పెంపకానికి వెనుకంజ వేస్తున్నారు. ఉష్ణోగ్రతతో కోళ్లు చనిపోతే కోలుకోలేని దెబ్బ పడుతుందని భావిస్తున్నారు. కోళ్లు సాధారణంగా 40 రోజుల్లో 2 నుంచి  3 కిలోల బరువు పెరుగుతుంది. కానీ వేసవిలో 48 రోజులు పడుతుంది. ప్రస్తుతం ఒక కోడి పెంపకానికి రూ.125 నుంచి రూ.135 వరకు ఖర్చు అవుతుంది.కంపెనీలు ప్రస్తుతం రూ.145 వరకు విక్రయిస్తున్నాయి. దీంతో రిటైర్డ్ గా స్కిన్ లెస్ చికెన్ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిస్తుండగా, విత్ స్కిన్ లెస్ రూ.280, లైవ్ కోడి రూ.180 వరకు విక్రయిస్తున్నారు.
చికెన్ ధరలు ప్రియం..లక్ష్మన్                                       
చికెన్ ధర ప్రియంగా మారింది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు ధరకు చేరింది. కిలో చికెన్ ధర రూ.300 కావడంతో చికేన్ వినియోగం తగ్గించాల్సి వస్తుంది. ప్రతి ఆదివారం చికెన్ రూ.200 నుంచి రూ.220 వరకు వెచ్చించాం. అలాంటిది రూ.300 పెట్టిన కేజీ రావడం లేదు. మటన్ ధరతోపాటు చికెన్ ధర కూడా అందుబాటులో లేకుండా పోతుంది.
Spread the love