హామీల అమలులో కార్మికులను మోసం చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

– జీపీ కార్మికుల ఉద్యోగుల సంఘం
(సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి ఏజె.రమేష్‌
నవతెలంగాణ-కొత్తగూడెం
గ్రామ పంచాయతీ కార్మికుల ఉద్యోగుల సమ్మె హామీల అమలులో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని గ్రామ పంచాయతీ కార్మికుల ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి ఏజె.రమేష్‌ విమర్శించారు. గురువారం కొత్తగూడెంలో స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు సాయి రత్న అధ్యక్షతన జరిగిన సీఐటీయూ అనుబంధ గ్రామ పంచాయతీ కార్మికుల ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే.రమేష్‌ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గత జూలై, ఆగస్ట్‌ నెలల్లో గ్రామ పంచాయతీ కార్మికుల ఉద్యోగుల సమస్యలపై నిరవధిక సమ్మె చేశారని, సమ్మె సందర్భంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు రాష్ట్ర జేఏసీతో చర్చలు జరిపి 15 రోజుల్లో సమ్మె డిమాండ్లను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. గ్రామ పంచాయతీ కార్మికులు తమను పర్మినెంట్‌ చేయాలని కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల సాధనకై రాష్ట్ర స్థాయిలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పడి 38 రోజులు పాటు సమ్మె నిర్వహించారని అన్నారు. సమ్మెను అణిచివేసేందుకు అధికార బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక రకాల నిర్బంధాన్ని ప్రయోగించిందని, అయినా ప్రజల మద్దతు, కార్మికుల ఐక్యత ముందు నిర్బంధాన్ని ఎదిరించి అత్యంత పట్టుదలతో సమ్మె పోరాటాన్ని కొనసాగించారన్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం రాష్ట్ర జేఏసీతో చర్చలు చేసిందన్నారు. మంత్రి కానీ, ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలపై మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోగా, ఏం చేసుకుంటారో చేసుకో పొండన్నట్లు వ్యవహరిస్తున్నదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీల అమలుకు సీరియస్‌గా ప్రయత్నం చేయాలని, లేని యెడల అక్టోబర్‌ 2వ తేదీ నుండి రాష్ట్ర జేఏసీ నాయకత్వంలో సమ్మెకి వెళతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ కార్మికుల ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు రమేష్‌, కాంతారావు, సదానందం, శ్రీనివాస్‌, లక్ష్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love