– జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్
నవతెలంగాణ- ఖమ్మం
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల బడ్జెట్ రూపకల్పన చేయాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీలకు సంబంధించి బడ్జెట్ రూపకల్పనపై మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో, కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేతనాలు, కరెంట్ చార్జీలు, సిసి చార్జీలు, రుణాల చెల్లింపులకు ప్రాధాన్యం కల్పిం చాలని అన్నారు. మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డు నిర్మాణం చేయాలన్నారు. మున్సిపాలిటీలు ప్రభుత్వం అందించే గ్రాంట్‌తో పాటు, తమ రెవెన్యూ పెంపొందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలలో ప్రాపర్టీ టాక్స్ వంద శాతం వసూలుకు ప్రత్యేక కార్యాచరణ చేయాలన్నారు. నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వేసవిలో తాగు నీటి సమస్యలు లేకుండా చూడాలని, తాగునీటి సంబంధ పనులు ఉంటే, వెంటనే పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ మీద దృష్టి పెట్టాలన్నారు. పురోగతిలో ఉన్న పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, సత్తుపల్లి, మధిర, వైరా మునిసిపల్ కమిషనర్లు సుజాత, రమాదేవి, కరుణాకర్‌రెడ్డి, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఇఇ కృష్ణలాల్, జెఏవోలు శివలింగం, ప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.