సీఐసీగా సమారియా సమాచార కమిషనర్లను నియమించిన కేంద్రం

సీఐసీగా సమారియా
సమాచార కమిషనర్లను నియమించిన కేంద్రంన్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ)గా హీరాలాల్‌ సమారియాను నియమించింది. కేంద్ర సమాచార కమిషన్‌లో ఈ పదవి గత నెల 3వ తేదీ నుండి ఖాళీగా ఉంది. గతంలో సీఐసీగా పనిచేసిన యశ్వర్థన్‌ కుమార్‌ సిన్హా పదవీ విరమణ చేశారు. 2020 నవంబర్‌ 7వ తేదీ నుండి సమాచార కమిషనర్‌గా పనిచేస్తున్న సమారియాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం పదోన్నతి కల్పించారు. సమాచార కమిషనర్‌గా సమారియా పదవీకాలం మంగళవారంతో ముగుస్తున్న నేపథ్యంలో ఆయనకు పదోన్నతి లభించింది. గతంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమారియా 2025 సెప్టెంబర్‌ 13 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు.
కాగా సమాచార కమిషనర్లుగా పనిచేస్తున్న సరోజ్‌ పున్హానీ, ఉదరు మహుర్కర్‌ల పదవీకాలం కూడా సోమవారంతో ముగిసింది. అయితే వీరి స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. వాస్తవానికి కేంద్ర సమాచార కమిషన్‌లో సీఐసీతో పాటు పది మంది కమిషనర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం సీఐసీ, ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆ ఇద్దరి పదవీకాలం కూడా ముగిసింది. అంటే ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషన్‌లో సీఐసీ సమా రియా మాత్రమే ఉన్నారు. సమాచార కమిషనర్ల పోస్టులను భర్తీ చేయకపోవడంపై గత నెల 30న సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనివల్ల సమాచార హక్కు చట్టం మృతప్రాయమైందని ఘాటుగా వ్యాఖ్యానించింది. సమాచార కమిషనర్ల పోస్టులను భర్తీ చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు సూచించింది. రాష్ట్రాల సమాచార కమిషన్లలో ఎన్ని కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సిబ్బంది మంత్రిత్వ శాఖను ఆదేశించింది. 2019లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్రాలు సమాచార కమిష నర్ల నియామకం జరపడం లేదని పిటిషనర్‌ అంజలి భరద్వాజ్‌ తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తెలిపారు. దీంతో పెండింగ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయని ఆయన చెప్పారు. 256 దరఖాస్తులు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా సమాచార కమిషన్‌లో ఎలాంటి నియామ కాలు జరపలేదని ఆర్‌టీఐ కార్యకర్త లోకేష్‌ బత్రా ఆగస్టులో తెలియజేశారు.

Spread the love