– హైదరాబాద్‌పై ముంబయి గెలుపు
– హైదరాబాద్ 173/8, ముంబయి 174/3
నవతెలంగాణ-హైదరాబాద్
సూర్యకుమార్ యాదవ్ (102 నాటౌట్, 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. వాంఖడే స్లో పిచ్‌పై ఫటాఫట్ ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడిన సూర్యకుమార్ యాదవ్ ముంబయి ఇండియన్స్‌కు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు. 174 పరుగుల ఛేదనలో సూర్యకు తోడుగా తిలక్ వర్మ (37 నాటౌట్, 32 బంతుల్లో 6 ఫోర్లు) సైతం రాణించగా 17.2 ఓవర్లలోనే ముంబయి లాంఛనం ముగించింది. రోహిత్ శర్మ (4), ఇషాన్ కిషన్ (9), నమన్ దిర్ (0) విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిశ్ హెడ్ (48, 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ పాట్ కమిన్స్ (35 నాటౌట్, 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. వాంఖడే స్లో పిచ్‌పై ట్రావిశ్ హెడ్ (48), అభిషేక్ శర్మ (11) తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలో హెడ్ ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో వన్‌మ్యాన్ షో చూపించాడు. పవర్‌ప్లే తర్వాత సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో వేగం మందగించింది. మయాంక్ అగర్వాల్ (5), హెన్రిచ్ క్లాసెన్ (2), షాబాజ్ అహ్మద్ (10)లు విఫలమయ్యారు. నితీశ్ కుమార్ రెడ్డి (20), మార్కో జాన్సెన్ (17) మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. 96/5తో ఉన్న సన్‌రైజర్స్ ఓ దశలో 173 పరుగులు చేస్తుందని ఎవరూ అనుకోలేదు. అబ్దుల్ సమద్ (3) సైతం నిరాశపరిచినా కెప్టెన్ పాట్ కమిన్స్ (35 నాటౌట్) డెత్ ఓవర్లలో విలువైన పరుగులు జోడించాడు.