గ్రూప్ వన్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించారు: కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గ్రూప్-1 పరీక్ష నిర్వహణను పక్కాగా నిర్వహించాలని, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే అధికారులను ఆదేశించారు. గురువారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో ఛీప్ సూపరిటెండెంట్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఐడెండిఫికేషన్ ఆఫీసర్స్, బయోమెటిక్ ఆఫీసర్లకు గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీజీపీఎస్సీ  ద్వారా ఈనెల 9 వ తేదీన నిర్వహించబడుతున్న గ్రూప్ -1 పరీక్ష ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని, పరీక్ష వ్రాసే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు ఉండాలని ఆదేశించారు. ఛీఫ్ సూపరింటెండెంట్లు పరీక్ష నిర్వహణను చేపట్టాలని, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కేంద్రాలలో సీటింగ్ అరేంజ్మెంట్, వసతులు పరిశీలించాలని, ఆడ మగ అభ్యర్ధులకు విడివిడిగా తనిఖీ ఏర్పాట్లు చేయాలని, ఇతరులను అనుమతించవద్దని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ యాక్షన్ ప్లాన్ కార్యాచరణతో పరీక్షాల కేంద్రాలను పరిశీలించాలని, పరీక్ష రోజున ప్రతి సెంటర్ మూడు సార్లు పరిశీలించాలని, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు అభ్యర్ధుల ఐడి కార్డులతో హాల్ టిక్కెట్లను పరిశీలించాలని, పరీక్షా కేంద్రాలలో ఎవరికీ మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని, ఒక చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రము ఎమర్జెన్సీ కోసం అనుమతి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు పరీక్ష వ్రాసే అభ్యర్ధులు కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఈ నెల 9 వ తేదిన జరిగే గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయము 10.30 గంటల నుండి మద్యాహ్నం 01.00 గంటల వరకు పరీక్ష జరుగుతుందని,  సుమారు 3349 అభ్యర్డులు హాజరగుతున్నారని తెలిపారు. *పరీక్ష కేంద్రాల గురించి,  హాల్ టికెట్ డౌన్ లోడ్ గురించి జిల్లా స్థాయి హెల్ప్ లైన్ నెం. 8331997006,  8331997037  సంప్రదించవచ్చునని సూచించారు. హాల్ టికెట్ ను http://www.tspsc.gov.in వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని, హాల్ టికెట్ ను A4 పేపర్ నందు ప్రింట్ తీసుకోవాలని తెలిపారు. హాల్‌ టికెట్‌లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి లేటెస్ట్ ఒరిజినల్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను గమ్‌తో అతికించాలని, అభ్యర్దులు పరీక్షహాలుకు హాల్ టికెట్ తో పాటుగా ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, పాన్ కార్డ్, ఓటరు ఐడి కార్డు, ఇతర ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి మరియు బ్లూ / బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ను తప్పనిసరిగా తీసుకెళ్లాలని, ఒకవేళ  హాల్ టికెట్ లో ఫోటో సరిగా ముద్రణ  కాకపోయినా, లేదా కనిపించనట్లయితే  అభ్యర్థి గెజిటెడ్ అధికారి/ అభ్యర్ది చివరగా చదివిన సంస్థ ప్రిన్సిపాల్  చేత ధృవీకరించబడిన మూడు (3) పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను,  అండర్‌టేకింగ్ ఫామ్ (TSPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌తో) తో పాటుగా తీసుకురావాలి. అట్టి ఫోటోలు, అండర్‌టేకింగ్ ఫామ్ ను  పరీక్ష హాల్‌లోని ఇన్విజిలేటర్‌కు  సమర్పించినట్లయితే అభ్యర్థి పరీక్షకు అనుమతించబడతారని, లేనట్లయితే అభ్యర్దిని పరీక్ష హాల్ లోకి అనుమతించబడరని తెలిపారు.
అభ్యర్థులు పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్ష హాలు నుండి బయటకు వెళ్ళేందుకు  అనుమతించబడరని, పరీక్ష హాలును వదలి వెళ్ళే ముందు, అభ్యర్థి OMR ఆన్సర్  షీట్ ను ఇన్విజిలేటర్‌కు అందజేయాలని, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ ద్వారా అభ్యర్థి తన బయోమెట్రిక్‌ ను క్యాప్చర్ చేసే వరకు పరీక్ష హాలు నుండి బయటకు అనుమతించబడరని, అభ్యర్థి ఎవరైనా తన బయోమెట్రిక్‌ ను ఇవ్వకపోతే వారి ఓఎంఆర్   ఆన్సర్ షీట్ మూల్యాంకనం చేయబడదని తెలిపారు. చేతులకు మెహంది, టాటూలతో పరీక్షకు వెళ్లకూడదని, ఒకవేళ ఉంటే బయోమెట్రిక్ చేయుటకు తంబ్ ఇంప్రెషన్ పడకపోవచ్చునని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్దులు షూస్, సాక్స్ ధరించరాదని, కేవలము చెప్పులు మాత్రమే ధరించాలని, పరీక్ష కేంద్రము లోనికి ప్రవేశించడానికి  ఉదయము 09.00 గంటల నుండి 10.00 గంటల వరకు అనుమతి ఉంటుందని, ఉదయం 10.00 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైననూ పరీక్ష హాలు లోనికి అనుమతించబడరని,  పరీక్ష కేంద్రము మెయిన్ గేట్ ఉ.10.00 గం.లకు మూసివేయబడుతుందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్దికి ఒకవేళ చేతులు లేకపోతే సహాయకులు కావాలి అని ముందుగానే దరఖాస్తు చేసినవారికి మాత్రమే పరీక్ష కేంద్రము వారు స్క్రైబ్ ను ఇస్తారని, అనుమతి లేకుండా ఎవరూ సహాయకులను తీసుకురాకూడదని తెలిపారు. అభ్యర్థులు పరీక్షకు కనీసం ఒకరోజు ముందుగా తమ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా కేంద్రం యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని తెలుసుకోవాలని కోరారు.
పరీక్ష కేంద్రము లోకి వాటర్ బాటిల్ అనుమతించరని, పరీక్ష కేంద్రం వారే త్రాగు నీటి సౌకర్యము కల్పిస్తారని, పరీక్ష కేంద్రము లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైలు ఫోన్ లు, కాలిక్యులేటర్లు, చేతి గడియారాలు , హాండ్ బ్యాగ్ లు, బ్లూటూత్ డివైస్ లు, పెన్ డ్రైవ్ లు, రైటింగ్ ప్యాడ్ లు, తెల్ల కాగితాలు అనుమతించబడవని, పరీక్ష కేంద్రము వద్ధ వస్తువులు భద్రపరచడానికి కమిషన్ ఎలాంటి క్లోక్ రూమ్/ స్టోరేజీ సౌకర్యం కల్పించలేదని, కాబట్టి  అభ్యర్డులు ఇట్టి విషయాన్ని గమనించాలని సూచించారు. పరీక్ష వ్రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం, సమయాన్ని అంచనా వేయడానికి ప్రతి అరగంట పూర్తయిన తర్వాత హెచ్చరిక బెల్ మోగించబడుతుందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్దులు ఈ సూచనలు పాటించాలని కోరారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాధ రెడ్డి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణ రెడ్డి, టీజీపీఎస్సీ రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ బాలాజీ,  వ్యవసాయ శాఖ ఏడి నీలిమ, అధికారులు పాల్గొన్నారు.
Spread the love