గర్భిణికి ప్రసవం..పరీక్షకు సహకారం…మరవలేనివి

Giving birth to a pregnant woman..contributing to the exam...unforgettable– ఆర్టీసీ మహిళా సిబ్బంది, కానిస్టేబుల్‌ సురేష్‌కు సీఎం అభినందనలు
– విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిండు గర్భిణికి ప్రసవం చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బందిని, యూపీఎస్సీ పరీక్షా కేంద్రానికి ఓ యువతిని సకాలంలో చేర్చిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సురేష్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా వారిపై ప్రశంసలు కురిపించారు. విధి నిర్వహణలో కూడా వారు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. వివరాల్లోకి వెళ్తే…. ఊరెళ్దామని కరీంనగర్‌ బస్టాండ్‌కు వచ్చిన ఓ నిండు గర్భిణి పురుటి నొప్పులు పడుతుంటే ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డుపెట్టి ప్రసవం చేశారు. 108 వాహనం వచ్చే లోపే సాధారణ డెలివరీ చేసి తల్లి, బిడ్డను ఆస్పత్రికి తరలించారు. దీంతో వీరిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి సీఎం స్పందించారు. ”కరీంనగర్‌ బస్టాండ్‌లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న మహిళా సిబ్బందికి నా అభినందనలు. మీరు సకాలంలో స్పందించడంతో తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా” అని పేర్కొన్నారు. మరో ఘటనలో రాజేంద్రనగర్‌ కానిస్టేబుల్‌ మానవత్వం చాటుకున్నారు. మహావీర్‌ కాలేజీలో యూపీఎస్సీ పరీక్షా కేంద్రం ఉన్న ఓ యువతి ఆర్టీసీ బస్సులో మైలార్‌దేవ్‌పల్లి వద్ద దిగింది. అక్కడికి పరీక్షా కేంద్రం చాలా దూరంలో ఉండటం, సమయం మించిపోతుండటంతో హైరానా పడింది. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సురేష్‌ ఆమె ఆందోళనను గుర్తించి పరీక్షా కేంద్రానికి సకాలంలో చేర్చారు. స్థానికులు తీసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సీఎం స్పందించారు. ” వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుం డా సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సురేష్‌కు నా అభినందనలు. అతని సహకారంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్‌ ది బెస్ట్‌” అని పేర్కొన్నారు. రెండు సంఘటనల్లో ప్రభుత్వ సిబ్బంది సకాలంలో స్పందించి మానవత్వం చాటుకోవడాన్ని ప్రజలతో పాటు స్వయంగా సీఎం ప్రశంసించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Spread the love