“పసితనం సారాన్ని నాశనం చేశారు” అనే శీర్షికతో ఐక్యరాజ్యసమితి నియమించిన స్వతంత్ర కమిషన్ 94పేజీల నివేదిక గాజాలో ఇజ్రాయిల్ మారణకాండను ఇటీవల నిర్ధారించింది. ఇజ్రాయిల్ పనిగట్టుకొని గాజాలో పిల్లలను లక్ష్యాలుగా చేసుకొని మారణకాండకు పాల్పడిన తీరును ఆ నివేదిక ప్రపంచం ముందుంచింది. ఆ దాడుల్లో గాయపడిన, శాశ్వత వికలాంగులుగా మారిన వారు, వారిని చూసి భవిష్యత్ తరాల పిల్లలు ఎలాంటి క్షోభకు గురౌతారో మాటల్లో వర్ణించలేము. ఆక్రమిత పాలస్తీనా విముక్తికి నూతన తరాలు ముందుకు రాకుండా వారిలో పిరికితనాన్ని నింపేందుకే ఇజ్రాయిల్ ఒక పథకం ప్రకారం ఈ పని చేసింది తప్ప మరొకటి కాదు. అయితే, హిట్లర్ మూకలు యూదులను ఊచకోత కోయటాన్ని యావత్ సభ్యసమాజం నిరసించింది. అంతకు ముందు మధ్య యుగాల్లో కూడా మతం పేరుతో జరిగింది. బాధి తులుగా ఫోజు పెట్టి సానుభూతి పొందిన అదే యూదులు తామే దురహంకారులుగా మారి పాలస్తీనా ప్రాంతమైన గాజాలో అంతకంటే దారుణమైన మారణకాండ సాగిస్తున్నారు. చరిత్రలో యూదులతో పాటు రోమాలు, స్లావక్ జాతులను వెంటాడి వేటాడారు. అరబ్బులను మనుషులుగా కూడా గుర్తించటానికి నిరాకరిస్తున్న ఇజ్రాయిల్ దురహంకారులను వారికి నాయకత్వం వహిస్తున్న ఇజ్రాయిల్‌ను సమర్ధిం చటం గర్హనీయం,ప్రమాదకరం.
నిజానికి 2023 అక్టోబర్ ఏడవ తేదీ నుంచి ఆత్మరక్షణ పేరుతో ఇజ్రాయిల్ మిలిటరీ సాగించిన దారుణ మారణకాండ గురించి ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పిన వాటిని ఐరాస కమిషన్ అధికారికంగా నిర్ధారించటం గమనించాల్సిన అంశం. ఈ నివేదిక తప్పుల తడక, తమను లక్ష్యంగా చేసుకొని రూపొందించినట్లు ఇజ్రాయిల్ ఆరోపించింది. సరిగ్గా దాని భాషలో కాకపోయినా అదే సారాన్ని ఐరాస సంస్థల నుంచి ఒకదాని తరువాత మరొకదాని నుంచి వైదొలుగుతున్న, నిధులు నిలిపివేస్తున్న అమెరికా, ఐరోపా అగ్రదేశాలు, వాటి కనుసన్నలలో పనిచేసే మీడియా వెల్లడించటాన్ని యావత్ సమాజం దిగ్భ్రాంతి చెందింది. వర్తమాన సమాజంలో ఒక జాతిని మరోజాతి అంతం చేయటాన్ని ఇంత నిస్సిగ్గుగా సమర్ధించటం మానవత్వానికే కళంకం. ఆత్మ రక్షణ సాకుతోనే అమెరికా-ఇజ్రాయిల్ కూటమి ఇటీవల ఇరాన్‌పై దాడులు చేయటమే గాక యావత్ నాగరికతను అంతం చేస్తామని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధ్యంగాక తోకముడిచాడు, పరువు కాపాడుకొనేందుకు అదే ఇరాన్‌తో ఒప్పందానికి వెంపర్లాడుతున్నాడు. ఐరాస స్వతంత్ర కమిషన్ 2023 అక్టోబరు ఏడు నుంచి 2026 మార్చినెల 31 వరకు జరిగిన ఉదంతాలను విచారించింది.
ఈ సందర్భంగా పదమూడు సార్లు వివరణ కోరినప్పటికీ ఇజ్రాయిల్ నుంచి ఎలాంటి స్పందనలేదు. గాజాలో జరిగిన దానితో పోల్చేందుకు వర్తమాన చరిత్రలో పౌర సమాజంపై జరిపిన రాజ్యహింస మరొకటి లేదు. ఫలానా చోట పిల్లలు ఉన్నారని తెలిసి కూడా గురిచూసి దాడులు చేసినట్లు పేర్కొంది. ‘ఈ ఉదంతాల్లో 20,179 మంది పాలస్తీనియన్ పిల్లలు మరణించారు. 44,143 మంది గాయపడ్డారు. మొత్తం రెండేండ్ల కాలంలో గాజా మారణకాండకు బలైన వారిలో పిల్లలు 27శాతం ఉన్నారు. ప్రపంచంలో ఏ సందర్భంలోనూ ఇంత సంఖ్య లేదు’ అని ఐరాస కమిషన్ పేర్కొన్నది. వీరంతా యుద్ధ రంగంలో హతులైన వారు కాదని, పనిగట్టుకొని తీసిన ప్రాణాలని నివేదికలోని ప్రతి పేజీ ఘోషించింది. అంతర్జాతీయ న్యాయ చట్టాలు, యుద్ధ నేరాల నిర్వచనం పరిధిలోకి వచ్చే దురాగతాలను కమిషన్ నమోదు చేసింది. నాలుగు రకాల మారణకాండ చర్యలను గాజాలో పాలస్తీనియన్ల మీద అమలు చేయగా అందులో మూడు ప్రత్యేకించి పిల్లల మీద కేంద్రీకరించారు. మరొక దుర్మార్గం ఏమంటే భవిష్యత్‌లో జననాలను నిరోధించేం దుకు, పునరుత్పాదక సామర్ధ్యాన్ని తగ్గించేందుకు, పుట్టిన వారు వికలాంగులుగా మారేందుకు కూడా కుట్ర పన్నారు. పసి పిల్లలకు అవసరమైన చికిత్స అందించే ఆస్పత్రులు ఆరోగ్యవసతులను పథకం ప్రకారం నాశనం చేశారు.
ఆరు దశాబ్దాలుగా అనేక తరాలు ఇలాంటి మారణకాండ మధ్యనే ఉద్భవించాయి, మాతృభూమికోసం పోరాడటాన్ని పుట్టుక తోనే వంట బట్టించుకున్నాయి. అలాంటి జాతిని ఈ మారణ కాండ నిలువరిస్తుందను కోవటం దురాశతప్ప మరొకటి కాదు. మానవ జాతి ఇలాంటి దుర్మార్గాలను ఎన్నింటినో చూసినప్పటికీ పిరికిబారలేదు. దోపిడీ, దుర్మార్గాలు, అణచివేతలు ఎంత ఎక్కువగా ఉంటే అంతకంటే ఎక్కువగా వాటికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది. ఇజ్రాయిల్ మారణకాండను సమర్ధించిన వాటిలో మన దేశాన్ని పాలిస్తున్న మోడీ సర్కార్ ఒకటి. ఇజ్రాయిల్‌తో స్నేహం కారణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. గాజాలో చంపిన పిల్లలను కూడా ఆత్మరక్షణ కోసమే అని, హమాస్ తీవ్ర వాదులను పట్టుకోవటం కోసం దాడులని సమర్ధించు కోవటమే కాదు, అన్నెంపున్నెం ఎరుగని పిల్లలను కూడా ఉగ్రవాదులుగా టెలి అవీవ్ చిత్రీకరించింది. దాన్ని మనదేశం వెనకేసుకొచ్చింది. ఇప్పుడు ఐరాస కమిటీ వెల్లడించిన నివేదికను సమర్ధిస్తుందా? ఇజ్రాయిల్ దుర్మార్గానికి మన ప్రభుత్వం మద్దతు పలుకుతుందా అన్నది ప్రశ్న!
గాజాలో ‘‘పసితనపు సారాన్ని నాశనం చేశారు’’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


