హీరో నితిన్ కు గాయాలంటూ ప్రచారం.. స్పందించిన సినిమా యూనిట్!

నవతెలంగాణ- హైదరాబాద్: టాలీవుడ్ హీరో నితిన్ కొత్త సినిమా ‘తమ్ముడు’ షూటింగ్ లో ప్రమాదం జరిగిందని, నితిన్ గాయపడ్డారని వస్తున్న వార్తలను ఆ సినిమా యూనిట్ ఖండించింది. షూటింగ్ లో ఎలాంటి ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చింది. హీరో నితిన్ భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చామని తెలిపింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో మకాం వేసిన ఈ చిత్ర బృందం.. హీరో అనారోగ్యం కారణంగా ప్రస్తుతం షూటింగ్ నిలిపివేసింది. నితిన్ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా, నితిన్ హీరోగా వచ్చిన ఇటీవలి సినిమాలు ‘ఎక్స్ ట్రా.. ఆర్డినరీ మ్యాన్’, ‘మాచర్ల నియోజకవర్గం’.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ‘తమ్ముడు’ సినిమా కోసం నితిన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ లో నితిన్ గాయపడ్డారంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో తమ్ముడు సినిమా యూనిట్ తాజాగా వివరణ ఇచ్చింది.

Spread the love