అవినీతికి అంత‌మెక్క‌డా..!

 ప్రభుత్వశాఖల్లో పెరుగుతున్న లంచాల పర్వం
 కొందరు అధికారులు, ఉద్యోగుల తీరుతో అప్రతిష్ట
 డబ్బులు ఇవ్వలేక చితికిపోతున్న రైతులు, సామాన్యులు
 తాజాగా ఏసీబీకి చిక్కిన కడెం తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌
 ఉమ్మడి జిల్లాలో ఏటా పట్టుబడుతున్న అక్రమార్కులు
ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలను లబ్ధిదారులకు చేకూర్చడంలో ఆయా ప్రభుత్వశాఖలదే ప్రముఖ పాత్ర. ప్రజా సమస్యల పరిష్కరించడంలోనూ వారే కీలకం. ప్రజల్లోనూ అధికారుల పట్ల గౌరవభావం ఉంటుంది. కానీ కొందరు అధికారులు, ఉద్యోగుల తీరు కారణంగా అప్రతిష్ట పాలు కావాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి నెలనెలా వచ్చే జీతం కాకుండా..అదనంగా అమ్యామ్యాలకు అలవాటు పడి అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడుతున్నారు. సమాజంలో దోషులుగా ముద్ర వేసుకుంటున్నారు. వీరి లంచాల ఆశ కారణంగా రైతులు, సామాన్యులు చితికిపోతున్నారు. ప్రతి చిన్న సమస్యను పరిష్కరించుకోవాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు కావనే అభిప్రాయం ఉండటంతో గత్యంతరం లేక ముడుపులు ఇచ్చుకోవాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోపక్క 2020 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఎదో ఒక శాఖ అధికారులు అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడుతుండటం ఉమ్మడి జిల్లాలో లంచాల పర్వం పెరిగిపోతుందనడానికి ఉదాహరణగా నిలుస్తోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వశాఖల్లో లంచాల పర్వం కలకలం రేపుతోంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వారు చేసే పనులకు సర్కారు ప్రతి నెలా రూ.లక్షల్లో జీతం అందిస్తోంది. కొందరు అధికారులు సేవాభావం, నిజాయితీగా వ్యవహరిస్తూ పేదలకు ఆయా పథకాలు దరిచేర్చడం, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక చొరువ చూపుతున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది పేదలకు లబ్ధి చేకూరుతోంది. కానీ కొందరు అధికారులు, ఉద్యోగులు మాత్రం అదనంగా వచ్చే లంచాలకు అలవాటు పడి అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు. రైతులు, సామాన్యులు వివిధ సమస్యలను పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ప్రాధేయపడుతున్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించకుండా వివిధ రకాల కొర్రీలు పెడుతూ వారి చుట్టూ తిప్పుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఆయా పనులు సకాలంలో పరిష్కారం కావాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాలని బేరసారాలకు దిగుతూ రైతులు, సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో పేదలు అధికారులకు లంచాలు ఇస్తూ సమస్యను పరిష్కరించుకుంటున్నారనే అభిప్రాయం ఉంది. కొందరు వ్యక్తులు మాత్రం లంచాలు ఇవ్వలేక అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదిస్తున్నారు. ఏసీబీ అధికారుల వేసిన వలలో పడుతున్న అవినీతి అధికారులు,ఉద్యోగులు కటకటాలు లెక్కిస్తున్నారు. తాజాగా కడెం మండలం కొత్తమద్దిపడగ గ్రామానికి చెందిన రైతు లాసెట్టి రాజన్న భూమి రిజిస్ట్రేషన్‌ కోసం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్‌ కావాలంటే రూ.15వేలు లంచం ఇవ్వాలని తహసీల్దార్‌ చెప్పడంతో రూ.9వేలకు బేరం ఒప్పందం కుదిరింది. బుధవారం సదరు రైతు కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ తహసీల్దార్‌కు డబ్బులు ఇవ్వగా.. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ రాజేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్‌ చిన్నయ్యలను పట్టుకున్నారు. ఇలాంటి ఉదంతాలు ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏటా జరుగుతుండటంతో లంచాల పర్వం ఏ మేరకు సాగుతుందో అర్థమవుతోంది.
మచ్చుకు కొన్ని ఉదాహరణలు
జిల్లాలో 2020 ఏడాదిలో ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం అంకోలి గ్రామానికి చెందిన ఓ గుత్తేదారు రూ.5లక్షల విలువైన సీసీ రోడ్లు వేయగా.. ఆ బిల్లుకు జారీకి ఉప గణాంక అధికారి ఇబ్బందులకు గురిచేయడంతో సదరు గుత్తేదారు ఏసీబీని ఆశ్రయించాడు. 2020 ఏడాదిలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. పట్టణంలోని భుక్తాపూర్‌కు చెందిన ఓ వ్యక్తిని రూ.15వేలు లంచం అడగ్గా..బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 2023 ఏడాదిలో చింతలమానేపల్లి ఎస్‌ఐ, హోంగార్డు రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ మహిళ తప్పిపోయిన కేసులో నిందితురాలిగా ఉన్న వ్యక్తి పేరును మినహాయించడంతో పాటు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ తిరిగి ఇచ్చే ప్రయత్నంలో ఫిర్యాదుదారు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో 2023లో సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు పట్టుబడ్డారు. నర్సాపూర్‌ (జి) మండలానికి చెందిన ఓ వ్యక్తి గిప్ట్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయానికి వెళ్లగా సదరు అధికారులు రూ.8వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా సదరు అధికారులు పట్టుబడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 2023 ఏడాదిలో మావల తహసీల్దార్‌ కార్యాలయంలో పట్టాపాస్‌బుక్‌లో వివరాలు సరిచేసేందుకు లంచం తీసుకున్న ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. తహసీల్దార్‌, ఆర్‌ఐ రూ.2లక్షలు తీసుకోగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

Spread the love