సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం

– దోపిడీ విధానాలకు బీజేపీ అనుకూలం
– కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి
– పోడు భూములన్నింటికీ పట్టాలు అందించాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, ఆదిలాబాద్‌టౌన్‌
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడంతో పాటు నియంతృత్వ ధోరణి అవలంభించడంతో ఎన్నికల్లో ఓడిపోయిందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో బుధవారం నిర్వహించిన పార్టీ ప్లీనం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు పార్టీ సీనియర్‌ నాయకుడు బండి దత్తాత్రి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దోపిడి విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికులు, కర్షకుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. దేశంలో కొద్ది మంది దగ్గరే సంపద పోగు కావడంతో నిరుద్యోగం, దారిద్య్రం పెరుగుతోందని, పేదరికం పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు జరుగుతున్నాయని ఏడాదికి వెయ్యి మంది హత్యకు గురవుతున్నారని పేర్కొన్నారు. దేశంలో అనేక దారుణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ భూస్వామ్య, పెట్టుబడిదారీ విధానాలు అవలంభించిందని..ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అంతకుమించి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పెట్టుబడిదారులు, డబ్బులు ఉన్న వారికి అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలిపారు. నిత్యావసర ధరలు తగ్గించడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని..30శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలిసూచిలో భారతదేశం 111స్థానంలో ఉందని, ఉపాధిహామీ నిధులను రూ.90వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లకు తగ్గించిందని పేర్కొన్నారు.
సీఎంను కలిసి విన్నవించాం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసినట్లు పేర్కొన్నారు. గత సర్కారు 13లక్షల ఎకరాల పోడు భూములకు గాను కేవలం 3లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసిందని గుర్తుచేశారు. మిగిలిన వాటికి పట్టాలు అందించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడంతో పాటు ఉద్యోగాలు భర్తీ చేయాలని, రాష్ట్రంలో 30లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవని గుర్తించామని, సీపీఎం ఆధ్వర్యంలోనే లక్ష కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాయని ఇలాంటి వారందరికీ ఇంటి పట్టాలు అందించడంతో పాటు ఇంటి నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరించిందని తాజాగా ఏర్పడిన ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. అనంతరం పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి బండారు రవికుమార్‌, జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌, పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు లంకా రాఘవులు, సీనియర్‌ నాయకుడు బండి దత్తాత్రి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నమొల్ల కిరణ్‌, పూసం సచిన్‌, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న, మంజూల, సురేందర్‌, నాయకులు శకుంతల, జమున తదితరులు పాల్గొన్నారు.

Spread the love