గత ప్రభుత్వం పనిభారం మోపింది

ఐఎన్టీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహమూద్‌
నవతెలంగాణ – ఆదిలాబాద్‌ టౌన్‌
గత ప్రభుత్వం ఆర్టీసీలో కార్మిక సంఘాల ప్రమేయం లేకుండా చేసి కార్మికులపై అదనపు పనిభారం మోపిందని ఐఎన్టీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సయ్యద్‌ మహమూద్‌ అన్నారు. బుధవారం యాదవ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్‌డబ్ల్యూయూ సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖాళీలను భర్తీ చేయకుండా కార్మికులపై పని భారం మోపిందన్నారు. కార్మికుల డబ్బులను గత ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి విన్నవించడం జరిగిందన్నారు. డీఏ, బాండ్‌, నిధులు రీకవరి తదితర అంశాలను దశాల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీలో సంఘాలు లేకుండా చేసిందన్నారు. హక్కుల సాధనలో సంఘాలే కీలకంగా ఉంటాయన్నారు. నూతన ప్రభుత్వంలో కార్మికులకు అంతా మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు అబ్రహం, గోపాల్‌, రాజారెడ్డి, సాయిరెడ్డి, యాదన్న, రమణ, రమేష్‌ పాల్గొన్నారు.

Spread the love