చివరి దశకు గ్రంథాలయం నిర్మాణ పనులు

– రూ.1.20 కోట్లతో అత్యాధునిక భవనం
– త్వరలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు
నవతెలంగాణ-ఆమనగల్‌
ఆమనగల్‌ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తిచేసి ఈనెలాఖరులోపు ప్రారంభించడానికి జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకవర్గం సన్నాహాలు చేస్తుంది. ఆమనగల్‌ పట్టణంలో దశాబ్దాల క్రితం నిర్మించిన గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో నూతన భవనం నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, పాలకులు పలుమార్లు ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గత జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ పాండురంగారెడ్డి చొరవ తీసుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో నూతన భవన నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా రూ.1 కోటి మంజూరు చేశారు. దీంతో గత ఏడాది రాష్ట్ర మంత్రులు నిరంజన్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
శరవేగంగా నిర్మాణ పనులు
గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.1 కోటి మంజూరు కావడంతో భవన నిర్మాణ పనులు చురుకుగా కొనసాగి ప్రస్తుతం నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. అసంపూర్తిగా ఉన్న పనులను, ప్రహరీ నిర్మాణానికి నిధులు సరిపోకపోవడంతో ప్రస్తుత జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ సత్తు వెంకటరమణారెడ్డి అదనంగా రూ.20 లక్షలు మంజూరు చేశారు. దీంతో ఆయా పనులను కూడా పూర్తి చేసి ఈనెలాఖరులోగా భవనాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. భవన నిర్మాణ పనులను ఇటీవల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, డైరెక్టర్‌ కమటం రాధమ్మ వెంకటయ్య పరిశీలించారు.

Spread the love