Homeకరీంనగర్ముందు తాళం సీల్.. వెనుక మద్యం ఫుల్‌

ముందు తాళం సీల్.. వెనుక మద్యం ఫుల్‌

- Advertisement -

-సీల్‌ వేసి చేతులు దులుపుకున్నారా..?
-నిషేధం అమల్లో ఉండగానే ఎక్సైజ్‌ అధికారుల పర్యవేక్షణ గాలికి..?
నవతెలంగాణ – రాయికల్
నిషేధం అమలు చేయాల్సిన శాఖే నిద్రపోతే…నిబంధనలు ఎవరికి? జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో మద్యం విక్రయాలపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో రాయికల్‌ పట్టణంలోని తిరుమల వైన్స్‌ పక్కన గల పర్మిట్ రూంలో చోటుచేసుకున్న వ్యవహారం ఎక్సైజ్‌ శాఖ పర్యవేక్షణ తీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ముందు భాగానికి సీల్‌ వేసినట్లు కనిపిస్తుండగా..వెనుక వైపు మాత్రం సంబంధిత పర్మిట్ రూం తెరిచి, మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. వినియోగదారుల నుంచి డిజిటల్‌ చెల్లింపులు స్వీకరించేందుకు క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ సైతం ఏర్పాటు చేసారు.అంటే దుకాణం మూసివేసినట్లు చూపిస్తూ.. విక్రయాలకు మరో మార్గం తెరిచినట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

-అధికారులు ఏం చేస్తున్నారు?
డ్రై డే ప్రకటించినప్పుడు దుకాణాలకు సీల్‌ వేసి వెళ్లిపోవడం మాత్రమే ఎక్సైజ్‌ శాఖ బాధ్యతా? సీల్‌ వేసిన తర్వాత విక్రయాలు జరుగుతున్నాయా లేదా అని తనిఖీ చేయాల్సిన అవసరం లేదా? నిషేధిత మూడు రోజుల్లో ఒక్కసారైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారా? నిర్వహించి ఉంటే వెనుక వైపు కొనసాగుతున్న విక్రయాలు అధికారుల కంటికి ఎందుకు పడలేదు?నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. నిషేధిత రోజుల్లో విక్రయాలపై నిఘా పెట్టడంలో ఎందుకు విఫలమయ్యారన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.

‘రోజుకు రూ.వెయ్యి’మాటల వెనుక ఏముంది?
విక్రయాలు ఎందుకు చేస్తున్నారని నిర్వాహకుడిని ‘నవతెలంగాణ’ ప్రశ్నించగా..రోజుకురూ.వెయ్యి చొప్పున వైన్స్‌ దుకాణానికి చెల్లించాల్సి ఉంటుందని, ‘పొట్టతిప్పల కోసం’ అమ్మకాలు చేస్తున్నానని చెప్పినట్లు తెలిసింది.

ఈ వ్యాఖ్యలపై ఎక్సైజ్‌ అధికారులు విచారణ జరపాల్సిన అవసరం ఉంది.నిజంగానే రోజువారీగా ఎలాంటి చెల్లింపులు జరుగుతున్నాయా? జరిగితే ఎవరికి? ఎందుకు? అనే అంశాలను అధికారులు స్పష్టం చేయాలి. అయితే ఇలాంటి వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చినా శాఖ నుంచి ఎలాంటి స్పష్టమైన స్పందన లేకపోవడం పర్యవేక్షణ తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

నిబంధనలు కాగితాలకేనా?

ప్రజా శాంతి,శాంతిభద్రతల దృష్ట్యా జిల్లా యంత్రాంగం మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తే..దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉంటుంది. ఆదేశాలు అమలు కాకుండా బహిరంగంగా విక్రయాలు జరిగితే.. అది కేవలం ఒక దుకాణం వ్యవహారం కాదు..పర్యవేక్షణ వ్యవస్థపై కూడా ప్రశ్న.

సీల్‌ దుకాణానికి మాత్రమేనా? నిబంధనలకు కూడా సీల్‌ పడిందా?
రాయికల్‌లో నిషేధిత మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -