మారణహోమాన్ని తక్షణమే ఆపాలి

The genocide must be stopped immediately– యూఎన్‌లో భారత్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండటం సరికాదు
– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
– కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో నేడు ఢిల్లీలో ధర్నా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ, గాజాలో ఇజ్రాయిల్‌ మారణహోమాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఆదివారం ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్టు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏకేజీ భవన్‌ (సీపీఎం ప్రధాన కార్యాలయం) ఎదుట ధర్నా చేపట్టాలని శనివారం హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పాలస్తీనా, గాజా వ్యవహారంలో ఇండియా వైఖరిని సీపీఐ(ఎం) ఖండించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో గాజాపై దాడులు, కాల్పుల విరమణ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ఇండియా తటస్థంగా ఉండటం సరికాదని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పాలస్తీనా పట్ల ఉన్న వైఖరికి విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. స్వతంత్ర రాజ్యం పాలస్తీనియన్ల ప్రాథమిక హక్కు అనే ఇండియా సుదీర్ఘ వైఖరికి ఇది పూర్తిగా విరుద్ధమని అన్నారు. ఇండియా స్వతంత్ర విదేశాంగ విధానం నుంచి తప్పుకుంటున్నదని, ఇది అమెరికా సామ్రాజ్యవాదానికి వంతగా మారిందని పేర్కొన్నారు. కాల్పుల విరమణ మానవత్వంలో భాగమని, ఇండియా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. 22 లక్షల మంది గాజా ప్రజలపై ఇజ్రాయిల్‌ చేస్తున్న ఆక్రమణ యుద్ధం పూర్తిగా అమానవీయమని అన్నారు. మొత్తం కమ్యూనికేషన్‌ వ్యవస్థ ధ్వంసమైందని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు ఫోన్‌ చేయడానికి కూడా వీలు లేకుండా చేశారని తెలిపారు. ఆస్పత్రులపైనా దాడులు జరుగుతున్నాయని అన్నారు. హమాస్‌తో ఏకీభవిస్తున్నామా లేదా అన్నది ప్రస్తుత సమస్య కాదని, గాజా ప్రజలు ఎదుర్కొంటున్న విషాదానికి పరిష్కారం తక్షణావసరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించలేదని ఏచూరి పేర్కొన్నారు.. ఇండియా వైఖరిని ఖండిస్తూ గాజాపై కాల్పులు విరమణ చేయాలి, మానవతావాద సహాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తామన్నారు.

Spread the love