తమిళనాడు గవర్నర్ గురించే ఇది. సుప్రీంకోర్టు మొన్నిచ్చిన తాజా తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది.రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనవారు దానికి లోబడి పనిచేయాలేగానీ, అధికారాన్ని అతిక్రమించరాదని గవర్నర్ ఆర్‌ఎన్ రవిని హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ జె.బి.పార్ధీవాలా, జస్టిస్ మహాదేవన్‌లతో కూడిన ధర్మా సనం గవర్నర్లు రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాల్ని ఇరుకున పెడుతున్న అనేక అంశాల పట్ల స్పష్టంగా ఎక్స్‌పోజ్ చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఆమోదించి పంపిన పది బిల్లుల్ని గవర్నర్ అట్టి పెట్టుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల సలహా మేరకు మాత్రమే గవర్నర్లు పనిచేయాలని, రాష్ట్రాలను వీటో చేసే అధికారం రాజ్యాంగం ఇవ్వలేదని తేల్చిచెప్పింది. ఇంతకాలం గవర్నర్లను అడ్డం పెట్టుకుని బీజేపీయేతర ప్రభుత్వాలని ముప్పుతిప్పలు పెడుతున్న మోడీ పరివారానికి ఈతీర్పు చెంపపెట్టులాంటిది. అలాగే సంఫ్‌ు భావజాలాన్ని నింపుకుని పనిచేస్తున్న గవర్నర్లకు కూడా ఇది మింగుపడనిది. అయితే సమాఖ్య భావవకు పెద్దపీట వేసేలా ఉన్న ఈ తీర్పు పట్ల దేశమంతా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తోంది. ‘ఇది ఒక్క తమిళనాడుకే కాదు, అన్ని రాష్ట్రాల భారీ విజయం’ అని డిఎంకే ముఖ్య మంత్రి స్టాలిన్ ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘ఈతీర్పు సమాఖ్య నిర్మాణం,శాసనసభ బలమైన హక్కుల ధృవీకరణ’గా అభివర్ణించారు.
బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తూ మోడీకి అనుయాయుడిగా పేరుతెచ్చుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిది మొదటినుంచి వివాదాస్పద శైలి. రాష్ట్ర ప్రభుత్వం చేసినా ఏ నిర్ణయాన్నీ కూడా ఆయన గౌరవించడు. శాసనసభ ప్రారంభ సమయల్లోనూ గవర్నర్ ఉపన్యాసంతో మొదలుపెట్టే ప్రక్రియలో ఆయన వివిధ కారణాల్ని ఎత్తిచూపుతూ రెండు మూడుసార్లు వాకౌట్ కూడా చేశాడు. ప్రజాసంక్షేమం, అవసరాల రీత్యా తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో పది కీలక బిల్లుల్ని ఆమోదిస్తే వాటిని తనవద్దే తొక్కిపెట్టాడు. కాలయాపన తర్వాత సంతకం చేయకుండానే వాటిని తిరిగి పంపించాడు. ఈ విషయమై ప్రభుత్వానికి కోర్టును ఆశ్రయించడంతో ఆ బిల్లుల్ని పరిశీలనకు రాష్ట్రపతికి రిజర్వ్ చేశాడు. అయితే గవర్నర్ అధికారాల్ని ఎంతవరకు ఉపయోగించాలో సుప్రీం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. బిల్లుల అంశంపై గవర్నర్ వ్యవహరించిన తీరు ఏకపక్షంగా ఉందని, ఇది చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. ఒకసారి శాసనసభ ఆమోదించిన బిల్లులకు సంతకాలు చేయ డానికి నిర్దిష్టమైన కాలపరిమితి ఏమీలేదని పేర్కొంది. ఇప్పటివరకు అడ్డుకున్న బిల్లుల్ని అసెంబ్లీ గవర్నర్‌కు తిరిగి పంపిన తేదీనుంచే ఆమోదం పొందినట్టేనని చెప్పింది. రాష్ట్రపతి తదుపరి చర్యల్ని కూడా పక్కకుపెట్టింది. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలకు ఇలా అడ్డుతగలడం గవర్నర్ల పనికాదని మరోసారి పునరుద్ఘాటించింది. ఈతీర్పు గవర్నర్ల హద్దుల్ని గుర్తుచేయడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలపరిచింది.
గవర్నర్ అంటే కేంద్రసర్కార్ రబ్బర్‌స్టాంప్ కాదని, ఆ పదవి రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థ అని గతంలో ‘ఎస్.ఆర్ బొమ్మై వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. తమిళనాడు ఒక్కటే కాదు, కేరళలోనూ ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల్ని గత గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తొక్కిపెట్టిన తీరు అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ తీర్పుతో అక్కడి బిల్లులకు కూడా మార్గం సుగమమైనట్టే! అయితే, తెలంగాణలోనూ గత గవర్నర్ తమిళిసైతో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చేదు అనుభవమే ఎదురైంది. ఈ సమస్య బెంగాల్ ప్రభుత్వం కూడా ఎదుర్కొంటోంది. 2023లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ‘గవర్నర్లు ప్రభుత్వాలకు అడ్డంకులుగా కాకుండా స్నేహితులు, తత్వవేత్తలు, మార్గదర్శకులు”గా పనిచేయాలని పంజాబ్ గవర్నర్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. అయినప్పటికీ రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాల్సిన గవర్నర్లు కేంద్ర సర్కార్‌కు రాజకీయ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శల్ని మూటకట్టు కున్నారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ గవర్నర్ల తీరుతో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని ఢిల్లీలో ఆందోళన కూడా చేశారు. ఇలాంటి ఘటనల్ని చూస్తే బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎలాగైనా సరే గవర్నర్లతో తమ పరిపాలన సాగించాలని చూస్తున్నట్టుంది. మోడీ ఈ పదకొండేండ్ల పాలన రాజ్యాంగాన్ని ఛిన్నాభిన్నం చేసింది. హిందూత్వవాదం సమాఖ్య స్ఫూర్తి భావనను దెబ్బతీసింది. ఈ క్రమంలో భారత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య బలోపేతానికి మరింత ఊతమిచ్చింది. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, దాన్ని అమలు చేసే వారు సరిగ్గా లేకుంటే అది చెడుగా కనిపిస్తుంది’ అని అంబేద్కర్ వ్యాఖ్యల్ని ఉటంకించి మరీ సుప్రీంకోర్టు పాలకులకు గట్టి చురకలే అంటించింది. ఈ తీర్పుతోనైనా అధికారంలో ఉన్నవారు బుద్ధి తెచ్చుకోవాలి. పాలనాతీరు మార్చుకోవాలి. లేదంటే ప్రజలే వారిని మారుస్తారు!