మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట 

– ఏటా కోటి మంది మహిళకు చీరలు పంపిణీ తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్
– హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
తెలంగాణ రాష్ట్రం లో మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని,అన్ని సంక్షేమ పథకాలను మహిళల పేరు మీదనే ఇవ్వడమే అందుకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ లో ప్రభుత్వం తరపున అందిస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ రెసిడెన్షియల్ గిరిజన పాఠశాల మరియు జూనియర్ కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, కేసిఆర్ పాలన స్వర్ణ యుగం లాంటిదని అన్నారు. తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు పుట్టింటి సారే లాగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు . రూ.500 కోట్ల బడ్జెట్ తో 90 లక్షల చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కీలకమని, అందుకే తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న , మార్కెట్ చైర్మన్ రజిని తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ ఐలేని అనిత, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love