– సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ – బోనకల్
ఆశా కార్యకర్తల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మధిర ఎమ్మెల్యే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిషత్ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న ఆశాల శిబిరాన్ని శనివారం ఆయన సంఘీభావం, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మల్లు భట్టి విక్రమార్క కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ వైద్య రంగంలో క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలుకు విలువ కట్టలేమన్నారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న వైద్య రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఆశా కార్యకర్తలు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవే అన్నారు. ఆశా కార్యకర్తలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షల ఇవ్వాలని, సంక్షేమ పథకాలన్నింటినీ వర్తింప చేయాలని, 32 రకాల రిజిస్టర్ లను వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వం సప్లై చేయాలని పలు డిమాండ్లు చేస్తున్నారని ఈ డిమాండ్లన్నీ న్యాయమైన అన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. ఆయన వెంట ఆయన టీపీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, కాంగ్రెస్ నాయకులు భూక్య భద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆశ కార్యకర్తలు రామన సరోజినీ ఇరుగు యశోద మరీదు లీల కుమారి గద్దె తులసి కొంగల వెంకటరమణ తదితరులు ఉన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: మల్లు భట్టి విక్రమార్క
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు మధ్యాహ్న బోజన కార్మికుల సమ్మె శిబిరాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శనివారం సందర్శించి సంఘీభావం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. ఆరు నెలల నుంచి తమకు బిల్లులు చెల్లించడం లేదని, ప్రభుత్వం సాక్షాత్ అసెంబ్లీలోనే ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు నెలకు చెల్లిస్తామని ప్రకటించారని కాని దానిని అమలు చేయడం లేదని ఆయనకు వివరించారు. భట్టి విక్రమార్క స్పందిస్తూ మీ సమస్యల పరిష్కారం అయ్యేవరకు మీకు అండగా కాంగ్రెస్ ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు ముళ్ళపాటి జయమ్మ, బానోతు నాగమణి, దుంపల సౌరమ్మ, చాపలమడుగు వసంత, లింగాల సుశీల తదితరులు ఉన్నారు.
మాజీ సర్పంచ్ నరసింహ రావు చిత్రపటానికి నివాళి:
మండల పరిధిలోనే జానకిపురం మాజీ సర్పంచ్ ఎన్నబోయిన నరసింహారావు కుటుంబ సభ్యులను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శనివారం జానకిపురంలో పరామర్శించారు. ఈ సందర్భంగా నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పైడిపల్లి కిషోర్ కుమార్, గాలి దుర్గారావు, జానకిపురం సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు తదితర నాయకులు ఉన్నారు.
ఆశాలు మానవహారం
బోనకల్ : ఆశా కార్యకర్తలు సమ్మెలో భాగంగా శనివారం స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో గంటపాటు ఆశా కార్యకర్తలు ఈ మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బూర్గుల అప్పచారి, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు ఇరుగు యశోద మండల కార్యదర్శి రామణ సరోజినీ ఆశాలు పాల్గొన్నారు.
వైరాటౌన్ : ఆశా, మధ్యాహ్నం భోజనం వర్కర్లు సమస్యల పరిష్కరించాలని సమ్మెలో బాగంగా మండల కేంద్రంలో శనివారం మానవ హారం నిర్వహించారు. ఆశా, మధ్యాహ్నం భోజనం వర్కర్ల దీక్షకు సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు పారుపల్లి కృష్ణారావు, సిపిఐ ఎంఎల్ నాయకులు కంకణాల అర్జునరావు, ఐఎఫ్‌టియు నాయకులు అశోక్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు, రూరల్ కన్వీనర్ బాజోజు రమణ, వర్కర్లు ప్రమీల, గీత, స్వాతి, కరుణ పాల్గొన్నారు.
కామేపల్లి : అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అంబటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం వారి సమ్మెకు సంఘీభావం తెలిపారు.
ఆశా వర్కర్‌కు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఆశా వర్కర్ల సమ్మెకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ కార్య క్రమంలో మండల ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాసరెడ్డి, బండారు నరసింహారావు, సొసైటీ వైస్ చైర్మన్ కడియం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
జూలూరుపాడు : ఆశా కార్యకర్తలు శనివారం మండల కేంద్రంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు మండల నాయకులు వల్లమళ్ల చందర్ రావు మాట్లాడారు.
చండ్రుగొండ : చంద్రుగొండ ప్రధాన సెంటర్లో ఆశా కార్యకర్తలు, సిఐటియు నాయకులు, సీపీఐ(ఎం) నాయకులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఐలూరు రామ్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రామడుగు వెంకటాచారి, సిపిఎం మండల కమిటీ సభ్యులు పెద్దిన్ని వేణు పాల్గొన్నారు.
అంగన్వాడీల రాస్తారోకో
సుజాతనగర్ : అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రాస్తారోకో నిర్వహించి మానవహారం చేపట్టారు.
అశ్వారావుపేట : అంగన్వాడీల సమ్మెకు జనసేన నైతిక మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నియోజక వర్గం ఇంచార్జి డేగల రామచంద్రరావు అన్నారు. శనివారం శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.