హోంగార్డు నవకిషోర్‌ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

– మంత్రి కోమటిరెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
అసెంబ్లీలో చెప్పాల్సిన విషయాలను సభకు రాకుండా డుమ్మాలు కొడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి బహిరంగ సభలు పెట్టి అమాయకుల ప్రాణాలు తీయడం మానుకోవాలని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేసిఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హితవు పలికారు. సభకు రావాలని ప్రతిరోజూ ఆహ్వానం పంపినా, కేసీఆర్‌ నుంచి స్పందన లేకపోవడం ఆయన దొరతనానికి నిదర్శనిమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారనీ, తగిన సమయంలో వారే గట్టి బుద్ధి చెప్తారని ఆయన వాఖ్యానించారు. దేశంలోనే అత్యంత భారీగా రూ.900 కోట్ల ఫండ్‌ కలిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ, నల్లగొండ వద్ద ఎమ్మెల్యే లాస్యా నందిత కారు కింద పడి చనిపోయిన హోంగార్డు నవకిషోర్‌ కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అవసరం లేకున్నా వందల కోట్లు ఖర్చుతో వేలాదిమందితో ఓ సభ పెట్టి అబద్ధాలు, అసత్యాలు చెప్పి ప్రజలను ఆగామాగం చేసేందుకు కుట్రలు చేయడం కేసిఆర్‌కు తగదని ఫైర్‌ అయ్యారు. అధికారం పోయినా బీఆర్‌ఎస్‌ నాయకులకు అహంకారం తగ్గలేదని గుర్తు చేశారు. వందలాది కార్లతో ర్యాలీలు పెట్టి ఓ నిరుపేద హోంగార్డు ప్రాణం తీయడం ఎంతవరకు సబబని నిలదీశారు. చనిపోయిన హౌంగార్డుకు వ్యక్తిగతంగా రెండు లక్షల ఆర్ధిక సహాయం చేసిన మంత్రి కోమటిరెడ్డి , ప్రభుత్వం తరఫున ఆయన భార్యకు ఉద్యోగం, వారి పిల్లల చదువులు పూర్తయ్యే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జీ.ఓ.నెం. 46 పెట్టి నల్లగొండ యువత పొట్టగొట్టిన కేసిఆర్‌, సభ పెట్టి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్‌ అండ్‌ కో తమ స్వార్ధ రాజకీయాలకు అమాయకులను బలితీసుకోవడం మానుకొవాలని బుధవారం ఒక ప్రకటనలో హితవు పలికారు.

Spread the love