ఉస్మానియా ఆస్పత్రి ముందు హోంగార్డు భార్య ఆందోళన

నవతెలంగాణ – హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతితో ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆయన భార్య సంధ్య ఆందోళన చేపట్టింది. తన భర్త మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేసింది. రవీందర్ ను అన్యాయంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేసిందామె. తన భర్త చనిపోయాడనే విషయం చెప్పకుండా దొంగ చాటుగా ఉస్మానియా మార్చురీకి తీసుకొచ్చారని సంధ్య మండిపడింది. చందు, నర్సింగ్ రావులు తన భర్తను బూతులు తిట్టి, అతన్ని వేధించారని ఆగ్రహం వ్యక్త చేసింది. ఈ క్రమంలో తనను వేధించడమే కాకుండా.. బైక్ లో పెట్రోల్ నింపుతుంటే సిగరెట్ అంటుకుని గాయాలు అయ్యాయని అబద్దం చెప్పారని విమర్శించింది. రవీందర్ మృతిపై ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరికాసేపట్లో హోంగార్డు రవీందర్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా మార్చరి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రవీందర్ మృతదేహంతో హోంగార్డు అసోసియేషన్ జేఏసీ ఆందోళన బాట పట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రవీందర్ మృతదేహంతో హోంగార్డు జేఏసీ సచివాలయంకు వెళ్లాలని ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 16 వరకు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. దీంతో ఉస్మానియా పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Spread the love