– పేద ప్రజలపై బాణం వేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం
– దుబ్బాకలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ- మిరుదొడ్డి : కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ సిఎన్ జీ ధరలు పెంచడాన్నీ వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.అనంతరం సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన వెంటనే దేశ ప్రజలను మోసం చేస్తూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ మూడు రూపాయలు సిఎన్జి రెండు రూపాయలు ధరలు పెంచి దేశ ప్రజానీకం పై మోయలేని భారాలు మోపిందని విమర్శించారు. ప్రజలు పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వేతనాలు పెరగలేని సందర్భాలలో ప్రజలకు ఆర్థికంగా మేలు చేయకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయనే సాకుతో పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు పెంచడం సరైనది కాదని విమర్శించారు.
ఔగత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ బ్యారెల్ ధరలు 40 డాలర్లకు పడిపోయిన సందర్భాలలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా ఆయిల్ కంపెనీ యజమానులు మరియు కేంద్ర ప్రభుత్వం లాభాలను ఆర్జించిందని విమర్శించారు.గత 12 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన సుమారు 40 లక్షల కోట్ల రూపాయల సేజ్ వసూలు చేసిందని ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగిన సందర్భంలో గతంలో ప్రజల నుంచి వసూలు చేసిన సెజ్ నుండి సబ్సిడీలు ఇవ్వకుండా ధరలు పెంచడం దుర్మార్గం అన్నారు.సిఎన్జి ధరలు పెంచడం వల్ల ఆటో డ్రైవర్లు రావణా రంగ కార్మికులందరూ ఇబ్బందులకు గురవుతారని పరోక్షంగా పేద ప్రజలపై బారాలు పడతాయని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వలన రవాణా బారాలతో పాటు నిత్యవసర వస్తువులు,వ్యవసాయ అవసరాల పైన తీవ్రంగా ధరలు పెరిగి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ పైనే పెను ప్రభావం చూపుతోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ నాయకులు ఎండి సాదిక్, ఎండి సాజిద్ , కంపే ఎల్లయ్య, శ్రీనివాస్, కృష్ణహరి, మల్లేశం, రవికుమార్, స్వామి, బత్తుల రాజు, తదితరులు పాల్గొన్నారు.



