– పట్టించుకోని గ్రామ సర్పంచ్..
నవతెలంగాణ – జుక్కల్
ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని కంఠాలి-గుండూర్ రోడ్డు తీవ్రంగా దెబ్బతిని, బురదతో పాటు రాళ్ళు తేలాయని శనివారం స్థానిక ప్రజలు తెలిపారు. దీంతో పంట పొలాలకు వెళ్ళే రైతులు ఈ దారిపై నడవలేని దుస్తితి దాపురించిందని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల కింద వేసిన మట్టిరోడ్లు కావడంతో ఎప్పడు వర్షాలు పడినా ఇదే తంటాలు పడాలని వారు వాపోయారు. మరోవైపు దారి బాగోలేదని, బురదలో రాళ్లు కాళ్లకు కుచ్చుకుంటున్నాయని కూలీలు కూడా వ్యవసాయ పనులకు రావడం లేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే రోడ్డుకు మర్మమత్తు పనులు చేయాలని గ్రామపంచాయతీ పాలక వర్గం తీర్మానించిందని చెప్పారు. అయితే రోడ్డుకిరువైపుల కొందరు రైతులు రాళ్లు, రప్పలు వేసి రోడ్డును ఆక్రమించారని తెలిపారు. రోడ్డు అంచుల్లో ఉన్న రాళ్ళని తొలగించి రోడ్డు విస్తరణకు సహకరించాలని సర్పంచ్ చెప్పినా రైతులు వినడం లేదని వివరించారు. ఈ విషయమై సర్పంచ్ ఎమ్మార్వోకు వినతి పత్రాన్ని కూడా సమర్పించారని స్పష్టం చేశారు. ఇలా సర్పంచ్ వర్సెస్ గ్రామస్తుల మధ్య రోడ్డు నలిగిపోతోందని వారు వాపోయారు. ఇప్పటికైనా ఇరు గ్రామాల ప్రజలు ఆలోచించి, రోడ్డును విస్తరించి, బాగు చేసుకుంటేనే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయనీ, వ్యవసాయం, ఇతర పనులకు వెళ్లాలన్నా మార్గం సుగమం చేసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ తో పాటు గ్రామస్తుల మీద కూడా ఉందన్నారు. వీలైనంత తొందరగా ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.


