Saturday, June 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్తెలు దాటిపోతున్న కానరాని వర్షాలు.!

కార్తెలు దాటిపోతున్న కానరాని వర్షాలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. రోహిణి, మృగశిర కార్తెలు ముగిసి ఆరుద్ర కార్తె కూడా దాటిపోతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్ సాగుపై రైతుల్లో అనుమానాలు మొదలయ్యాయి.కొందరు రైతులు వర్షం కోసం ఎదురుచూస్తూ ముందస్తుగా పత్తి విత్తనాలు వేశారు.ఆశగా దుక్కులు దున్ని విత్తనాలు చల్లినా చినుకు జాడ లేకపోవడంతో నేలలో విత్తనాలు అలాగే ఉండిపోయాయి. భూమిలో తేమ లేక దుక్కులు ఎండిపోయి నెర్రెలు వారుతున్నాయి. దీంతో వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇతర పంటలపై అనాసక్తి
వర్షాలు ఆలస్యమవుతుండడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.తక్కువ నీటితో పండే కంది, మొక్కజొన్న, ఆముదం, జొన్న పంటలను ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే పత్తి, మొక్కజొన్నకు ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు మళ్లీ వేరే పంటలు వేయడానికి జంకుతున్నారు.రెండోసారి విత్తనాలు, ఎరువులు కొనాలంటే పెట్టుబడి రెట్టింపు అవుతుందని, అప్పులు పెరిగిపోతాయని భయపడుతున్నారు. దిగుబడి వస్తుందో లేదోననే అనుమానంతో ప్రత్యామ్నాయ పంటల జోలికి వెళ్లడం లేదు.

వర్షం కోసం రైతుల ఎదురుచూపులు
వారం రోజుల్లో వర్షాలు కురిస్తేనే పంటలు దక్కుతాయని, లేకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు దాటిపోయినా చినుకు జాడ లేకపోవడంతో మండల వ్యాప్తంగా రైతులు వరుణదేవుడి కోసం ఆకాశం వైపు చూస్తూ ప్రార్థనలు చేస్తున్నారు.పెట్టుబడి దండగై అప్పుల పాలవుతామేమోనని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -