Tuesday, June 23, 2026
E-PAPER
Homeజాతీయంకమలం కుట్ర!

కమలం కుట్ర!

- Advertisement -

శిండే వర్గంలో ఆరుగురు యూబీటీ ఎంపీలు
విలీనానికి టైమ్ ఫిక్స్- మహారాష్ట్ర మంత్రి ప్రకటన

ముంబయి : ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయటానికి బీజేపీ ఉచ్చుబిగుస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమబెంగాల్ లో రెబల్స్ గా చీల్చటం వెనుక కమలం పార్టీ హస్తం ఉన్నదని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోనూ ఉద్ధవ్ ఠాక్రేను మరింతగా డ్యామేజీ చేసే దిశగా పావులు కదుపుతున్నదని శివసేన వర్గం ఆరోపిస్తోంది.
ఏం జరిగింది…?
శివసేన ఉద్ధవ్ వర్గం నేతల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయిక్ కీలక ప్రకటన చేశారు. యూబీటీ సేనకు చెందిన ఆరుగురు రెబెల్ ఎంపీలు ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలోని వర్గంలో సోమవారం చేరబోతున్నారని వెల్లడించారు. ఫలితంగా పార్లమెంటులో తమ పార్టీ బలం గణనీయంగా పెరుగుతుందని వివరించారు. ఇప్పటికే యూబీటీ సేన రెబెల్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ సమర్పించారని కూడా ఆయన తెలిపారు. “సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరుగురు ఎంపీలు అధికారికంగా శివసేనలో చేరనున్నారు. దీనివల్ల మా ఎంపీల సంఖ్య 7 నుంచి 13కి పెరుగుతుంది. ఇది శివసేన బలాన్ని గణనీయంగా పెంచుతుంది. ఆపరేషన్ టైగర్ ఏడాది పొడవునా 365 రోజులు కొనసాగుతుంది. బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలను అనుసరించే ఆరుగురు ఎంపీలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శివసేనలో చేరుతున్నారు. వారు ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ సమర్పించారు. మేము వారికి స్వాగతం పలుకుతున్నాం. అటు సంజయ్ రౌత్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన వల్లే మొదటగా ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరారు. ఇప్పుడు ఆరుగురు ఎంపీలు కూడా చేరుతున్నారు.” మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయిక్ చెప్పారు. ఎంపీల పార్టీ మార్పు గురించి తనకు అధికారిక సమాచారం లేదని శివసేన ఎమ్మెల్సీ డాక్టర్ మనీషా కయాండే చెప్పారు. “ఎవరూ రెబెల్స్ కాదు. వారు శివసేనలో చేరుతున్న ‘శివ సైనికులు’. దీని గురించి నాకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఏక్‌నాథ్ షిందే కచ్చితంగా దీనిని స్వాగతించారు. ఆదివారం ఓమ్రాజే నింబాల్కర్ తన వైఖరిని స్పష్టం చేశారు. ఇతర ఎంపీలు కూడా తమ నియోజకవర్గ ప్రజలను కలిశారు. సోమవారం ఏదైనా శుభవార్త రావచ్చు.” అని ఆమె అన్నారు.
అందువల్లే పార్టీని వీడుతున్నా : రెబెల్ ఎంపీ
మరోవైపు సోమవారం పార్టీని వీడుతున్నట్లు శివసేన (యూబీటీ) తిరుగుబాటు ఎంపీ నగేశ్ పాటిల్ అష్టికర్ ప్రకటించారు. అయితే పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోలో స్పష్టం చేశారు. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకాకపోవడం వల్ల తమపై చూపిన అవిశ్వాసం, వాడిన కఠినమైన భాష కారణంగానే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నగేశ్ పాటిల్ కుమారుడు కృష్ణ అష్టికర్ను పార్టీ నుంచి బహిష్కరించారు.
ఆరుగురు ఎంపీలు డుమ్మా
అంతకుముందు జూన్ 18న దిల్లీలో జరిగిన శివసేన యూబీటీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి 9మంది ఎంపీల్లో అరవింద్‌ సావంత్‌, అనిల్‌ దేశాయ్‌, రాజాభావూ వాజేలతో పాటు పార్టీకి చెందిన ఏకైక రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ మాత్రమే హాజరయ్యారు. విప్‌ జారీ చేసినప్పటికీ ఆరుగురు రెబెల్‌ ఎంపీలు నగేష్ ఆష్టికర్, సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ దినపాటిల్, ఓంప్రకాష్ రాజేనింబాల్కర్, భావూసాహెబ్ వాక్‌చౌరేలు సమావేశానికి దూరంగా ఉన్నారు. వారంతా తమను ఏక్‌నాథ్‌ శిందే సారథ్యంలోని శివసేనలో విలీనం చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఓ లేఖ రాశారు. తాజాగా ఆ పార్టీలో వీలినం కానున్నట్లు తెలిపారు.
బీజేపీపై ఆదిత్య ఠాక్రే ఫైర్
శివసేన (యూబీటీ) ఎంపీల తిరుగుబాటు నేపథ్యంలో ఆ పార్టీ నేత ఆదిత్య ఠాక్రే బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు అవసరమైన ఓట్లను పార్లమెంటులో సాధించే లక్ష్యంతోనే శివసేన (యూబీటీ) ఎంపీలు, ఎమ్మెల్యేలను బీజేపీ విడదీస్తోందని ఆరోపించారు. “బాబాసాహెబ్ అంబేద్క ర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే వారు మా ఎంపీలు, ఎమ్మెల్యేలను విడదీస్తున్నారు.
2024 ఎన్నికల్లో ఓటర్లు వారిని అడ్డుకున్నారు. దాంతో వారికి కేవలం 240 మంది ఎంపీలు మాత్రమే దక్కారు. కానీ ఇప్పుడు పార్టీలను చీల్చడం ద్వారా వారు మళ్లీ అదే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చడమే వారి ప్రధాన లక్ష్యం. వీరంతా ఎంవీఏ మిత్రపక్షాల సహకారంతో శివసేన (యూబీటీ) అభ్యర్థులుగా ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు ప్రజల తీర్పునకు విరుద్ధంగా అధికార పక్షానికి మారుతున్నారు.” అని ఠాక్రే అన్నారు.ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధవ్ ఠాక్రే పర్యటన సిద్ధమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -